- వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
వేద న్యూస్, వరంగల్ :
మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యమవుతుందని వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని నాయుడు పెట్రోల్ పంప్ సమీపంలో గల వినయ్ గార్డెన్స్ లో గురువారం జిల్లా సంక్షేమ అధికారి శారద అధ్యక్షతన నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, సంధ్యారాణి, అధికారులతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఈ సంవత్సరం మహిళలలో పెట్టుబడి పెట్టండి పురోగతిని వేగవంతం చేయండి అనే అంశంపై నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మహిళలు ఆర్థిక పెట్టుబడి తో పాటు విద్య, ఉన్నత విద్య, ఆరోగ్యపరంగా పెట్టుబడులు పెట్టి సమగ్ర అభివృద్ధి చెందాలన్నారు. పిల్లలకు విద్యాపరంగా ఉన్నతమైన విద్య అందించి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, ఆరోగ్యపరంగా మహిళలతోపాటు గర్భవతులకు బాలింతలకు పౌష్టిక ఆహార అందించి ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు. జిల్లాలో మహిళా అధికారుల సహాయ సహకారాలతో అభివృద్ధి పథంలో వెళుతుందన్నారు.
జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 54 వేల పిల్లలకు పౌష్టికాహారం అంగన్వాడీల ద్వారా విద్య అందించడం జరుగుతుందన్నారు. సఖి కేంద్రాల ద్వారా జిల్లాలోని 700 మంది కేసులను పరిష్కరించడం జరిగిందని, సఖీ, సిడబ్ల్యుసి, అంగన్వాడీల సమన్వయ సహాకారంతో జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టామని, బాధితులకు 50 లక్షల రూపాయల పరిహారం అందించడం జరిగిందన్నారు.
సంస్కారం కలిగిన భావితరాలను అందించడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు.
మహిళలతో సృష్టి మనుగడ సాధ్యమవుతుందని వారిపై వివక్షత లేకుండా అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ ఆత్మస్థైర్యమే గొప్ప ఆయుధమని మహిళలకు సముచిత స్థానం , అవకాశం కల్పిస్తే రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తారని, దీనికి చక్కటి ఉదాహరణ ఇటీవల ఏషియన్ పారా గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన మన జిల్లా కల్లెడకు చెందిన జీవన్ జీ దీప్తి అన్నారు.
ఆర్థిక స్వతంత్రం సాధించినప్పుడే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు.మహిళల్లో సాధికారిక నిరక్షరాస్యతపై వివక్ష హక్కుల సాధన 1908 లో ప్రారంభమై 1975 మార్చి 8వ తేదీ నుండి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నదని అన్నారు. మహిళలు సాధించిన ప్రగతి హక్కుల సాధనకు చక్కటి వేదిక అన్నారు. ఈ సంవత్సరం మహిళల్లో పెట్టుబడులు ఆర్థికంగా పురోభివృద్ధి అంశంతో నిర్వహిస్తున్న మహిళ దినోత్సవాలను మన రాష్ట్రంలో 90వ దశకంలోనే ఆర్థిక ఎదుగుదలకు మహిళా పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు మహిళల ఆరోగ్యం కొరకు, శిశు మరణాలు తగ్గించుటకు నిరంతరం శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు షాలువలతో సత్కరించి ప్రశంస పత్రాలను అందించారు. అనంతరం వివిధ క్రీడలలో గెలుపొందిన మహిళలకు జ్ఞాపికాలు, ప్రశంసా పత్రాలు కలెక్టర్, అదనపు కలెక్టర్లు, అధికారులు అందించారు.
ఈ సందర్భంగా సంక్షేమ శాఖ సిబ్బంది, అంగన్వాడి లచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ రిజవానా శమిమ్ మసూద్,స్థానిక కార్పొరేటర్లు అరుణ విక్టర్, గుండు చందనా పూర్ణ చందర్, పోశాల పద్మ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా క్రీడల అధికారి సత్యవాణి, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ వసుధ, సిడిపిఓలు అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు.