• సిటీ కాలేజీ ఓటరు దినోత్సవ సభలో వక్తలు

వేద న్యూస్, చార్మినార్:
‘‘నా కులం నా మతం నా వర్గం అనే అభిమానాన్ని విడనాడి అభివృద్ధి చేయగలిగే వారికే ఓటు వేయాలి’’ అని ఇగ్నో పూర్వ ఉపకులపతి ఆచార్య వాయునందన రావు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సిటీ కళాశాల సామాజిక శాస్త్రాల విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గురువారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ద్వారా ప్రజాస్వామ్యం వ్యవస్థను పరిరక్షించటంలో యువత బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం అందరికి అందుబాటులో ఉన్నపుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. ప్రధాన వక్తగా పాల్గొన్న ఆచార్య మోహన రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ధన స్వామ్యంగా మారి పొయిందని చెప్పారు.

డబ్బులు ఇస్తే తప్ప మేము ఓటువేయం అనే స్థితికి ఓటరు రావటం బాధాకరమని తెలిపారు. నిర్భంధ ఓటు వేసే విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టాలని, నా ఒక్క ఓటు వల్ల ఎం జరుగు తుంది అనే ఉదాసీన వైఖరి నుండి ప్రజలు విడనాడాలని పిలుపునిచ్చారు.

భారతీయ ఎన్నికల సంఘం నిర్భయంగా, పారదర్శకంగా నిర్వహించే స్థితిలో లేదని, టి.యస్.శేషన్ ఎంతో ప్రణాళిక బద్దంగా నిర్వహించి ఎన్నికల నిర్వహణలో తనదైన ముద్రవేశారని వెల్లడించారు. భారత దేశ రాజకీయ పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు నిర్వహించడం ఎంతో కష్ట సాధ్యమని పేర్కొన్నారు. మరో అతిథిగా పాల్గొన్న శ్రీనివాస గుప్తా మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర కీలకమని తెలిపారు. డబ్బుకు లొంగకుండా ఓటు వేయాలని, సోషల్ మీడియా అనే ఆయుధాన్ని ఉపయోగించి మంచి నాయకుడిని గెలిపించుకోవాలని సూచించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ ఆచార్య బాల భాస్కర్ మాట్లాడుతూ పల్లెల్లో అందరూ ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి పట్టం కడుతుంటే, పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు ఓటు వేయడానికి విముఖత చూపటం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వాపోయారు. ఈ సందర్బంగా నిర్వహించిన క్విజ్ పోటీ విజేతలకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు. డా.ఏ.శంకర్ సమన్వయం చేసిన ఈ కార్యక్రమ ప్రారంభంలో డా.కృష్ణ వేణి అధ్యాపకులు, విద్యార్థుల చేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. డా.భాస్కర్, డా.రత్న ప్రభాకర్, డా.యాదయ్య, లతా రాణి, డా.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.