వేద న్యూస్ , వరంగల్ :
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖేడే, హన్మకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, సంధ్యారాణి లతో కలిసి సార్వత్రిక ఎన్నికలకు నియమించిన ఆయా విభాగాల నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సిబ్బంది నిర్వహణ, శిక్షణ, మెటీరియల్, రవాణా, స్వీప్, శాంతి భద్రతలు, ఈ వి ఎం ల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తన నియామావళి, బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్, ఈటీబీపీఎస్, వ్యయ పర్యవేక్షణ, ఓటర్ల జాబితా, మీడియా మేనేజ్మెంట్, ఎంసీఎంసీ, సోషల్ మీడియా యూనిట్లు, కాంప్లెయింట్, మానిటరింగ్ సెల్, 1950 కాల్ సెంటర్ల నిర్వహణ, తదితర విభాగాల నోడల్ అధికారులకు ఎన్నికల కోడ్ సమయంలో నిర్వహించాల్సిన విధులపై కూలంకషంగా వివరించారు. జిల్లా నోడల్ అధికారులందరూ వారికి కేటాయించిన ఎన్నికల విధుల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పార్లమెంటు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు విధులను నిర్వహించాలని , ఆయా విభాగాల జిల్లా నోడల్ అధికారులు పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసంబ్లీ సెగ్మెంట్ల సిబ్బంది సమన్వయంతో నివేదికలు సేకరించి సమగ్ర నివేదికలను నిర్దేశిత కాలంలో తప్పని సరిగా పంపాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి ఉద్యోగి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకొనుటకు గాను ఫారం 12 సమర్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పోలింగ్ బూత్ ల వద్ద కనీస మౌలిక వసతులు, అవసరమైన రాంపులను, వేసవి దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, వంటి ఇతర సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మొదటి రాండమైజేషన్ పూర్తయినందున పి.ఓ, ఏ.పీ.ఓ లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్నికల సామాగ్రికి సంబంధించి ఎప్పటి కప్పుడు రాష్ట్రస్థాయి నోడల్ అధికారులతో సంప్రదింపులు చేస్తూ ఎన్నికల సామాగ్రిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై సంబంధిత నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా వచ్చే ఫిర్యాదులను వెంట వెంటనే పరిష్కరించడం, సి- విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించి పరిష్కరించాలని సంబంధిత అధికారికి ఆదేశించారు. ఈ సమావేశంలో డిసిపి రవీందర్, డి ఆర్ ఓ లు శ్రీనివాస్, గణేష్, ఆర్డీఓ లు దత్తు, కృష్ణవేణి, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీకాంత్, ఎన్నికల పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.