- జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకోటి యాదవ్ విమర్శ
- ‘జనంతో జనసేన’లో ప్రజాసమస్యలు తెలుసుకున్న మెరుగు
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
గతంలో పేదలకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ పార్టీ సర్కార్ మరిచిందని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మెరుగు శివకోటి యాదవ్ విమర్శించారు. ‘జనంతో జనసేన’ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో పేదలకు అందని ద్రాక్షగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మారాయన్నారు. సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతూ నర్సంపేట పట్టణ శివారులోని ప్రభుత్వ భూమిలో రేకుల షెడ్లు వేసుకుని దాదాపు 200 మంది పేద కుటుంబాలు నివసిస్తున్నాయని వివరించారు.
కొన్నేళ్లుగా సర్వే నెంబర్ 601/1, 111 ప్రభుత్వ భూమిలో నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ప్రభుత్వం అందించలేదని చెప్పారు. ఈ విషయమై అధికార పార్టీ ఎమ్మెల్యే చొరవ చూపలేదన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా ఈ సమస్యను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని మెరుగు శివకోటి యాదవ్ ప్రజలకు హామీనిచ్చారు. బంగారు తెలంగాణ సాధన దిశలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి తప్ప, నిరుపేదలకు చెందడం లేదని పేర్కొన్నారు.
నియోజవర్గంలో ఇల్లు లేని పేదలకు న్యాయం జరిగే విధంగా జనసేన పార్టీ అండగా నిలుస్తుందని వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. సామాన్యులకు అండగా నిలచే పార్టీ జనసేన పార్టీ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నర్సంపేట మండల అధ్యక్షుడు వంగ మధు, ప్రధాన కార్యదర్శి ఓర్సు రాజేందర్, కార్యవర్గ సభ్యులు అందే రంజిత్, గంగుల రంజిత్, బొబ్బ పృథ్వీరాజ్, గద్దల కిరణ్, పోషాల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.