- మద్యం సీసాలు పగులగొట్టి పడేసిన వైనం
- వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికుల వేడుకోలు
వేద న్యూస్, హన్మకొండ:
పవిత్రమైన దేవుడి విగ్రహం వద్ద కొందరు అసాంఘిక కార్యకలాపాలు చేస్తుండటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పులుకుర్తి గ్రామంలో రంగనాయకుల బోటు మీద హనుమంతుని విగ్రహం కట్టిస్తున్నారు. కాగా, కొందరు రాత్రివేళలో విగ్రహం దగ్గర మద్యం తాగి..సీసాలను అక్కడే పడేశారు. మద్యం మత్తులో వారు సీసాలు పగులగొట్టి పరిసరాల్లో పడేసినట్లు తెలుస్తోంది. తెల్లవారు జామున విగ్రహ నిర్మాణ నిమిత్తం పనికి వచ్చిన కార్మికులకు పగులగొట్టబడి ఉన్న మద్యం సీసాలు దర్శనమిచ్చాయి.

మద్యం మత్తులో పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి పనులకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులుకుర్తి గ్రామ బడి వద్ద కూడా కొందరు దుండగులు అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని సమాచారం. పవిత్రమైన బడి, గుడి పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం సరికాదని పలువురు గ్రామస్తులు ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. వెంటనే ‘ప్రత్యేక’ అధికారి ఈ విషయమై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

