- సంక్షేమ పథకాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా?
- కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ విమర్శ
- ఈ సారి హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు అభ్యర్థన
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/కమలాపూర్:
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలంలోని గుండేడు, కొత్తపల్లి, కన్నూరు, రాములపల్లి, భీంపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలతో ప్రణవ్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ, పెద్దవాళ్లను పలకరిస్తూ ముందుకు సాగిన ప్రణవ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పదేళ్ల పాలనలో ఏం చేశారని అధికార బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా? అని అడిగారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలను 15 రోజులు ఓపిక పడితే అన్ని తీరుస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఇక్కడి పాలకులు అభివృద్ధి కుంటుపడేశారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లో అభివృద్ధికి చొరవ చూపుతానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీరంతా కంకణం కట్టుకోవాలని, కాంగ్రెస్ గెలిస్తేనే అన్ని రంగాల అభివృద్ధి ,పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

కాంగ్రెస్ వచ్చాక ఆరు గ్యారెంటీ మేనిఫెస్టో పథకాలను తప్పకుండా అమలు చేస్తామని, జాబ్ క్యాలెండర్ తో యువకుల ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు చరణ్ పటేల్, సీనియర్ నాయకులు తవటం రవీందర్, బాలస్వామి రమేష్, దేశిని ఐలయ్య, వంశీకృష్ణ, శివ కృష్ణ, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
