•  మాజీ సమాచార కమిషనర్ దిలీప్ రెడ్డి

వేద న్యూస్, హైదరాబాద్/చార్మినార్:
భారత రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యం ప్రజల నుంచి దూరమవుతున్నదని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉన్నదని మాజీ సమాచార కమిషనర్ దిలీప్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కళాశాల సోషల్ సైన్సెస్ విభాగం, ప్రకాశం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో ‘భారత దేశంలో ఎన్నికల సంస్కరణలు-ఓటరు బాధ్యత’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశంలో తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రస్తుతం పాలిటిక్స్ ఒక పెట్టుబడిగా, ఈవెంట్ మేనేజ్ మెంట్ గా మారి సామాన్య మానవుడికి రాజకీయాలను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ రంగనిపుణులు ఉదయ్ శంకర్ ఎలక్షన్ సంస్కరణలపై, ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఐటీ అప్లికేషన్స్ సి-విజిల్ యాప్ ఆన్ లైన్ ఓటర్ నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు.

ప్రకాశం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ రావు గౌరవ అతిథిగా పాల్గొని ఎన్నికలపై ధనప్రభావం, ఎన్నికల కమిటీ పనితీరు తదితర విషయాలపై మాట్లాడారు. కళాశాల సీనియర్ అధ్యాపకులు డా.ఏలూరు యాదయ్య సదస్సుకు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

రచన కాలేజీ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర రావు తమ ప్రసంగంలో ‘ప్రస్తుత ఎన్నికలు-మీడియా’ పాత్రను వివరించారు. డా.శంకర్ కుమార్, డా. కృష్ణవేణి కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ సదస్సులో డా. నీరజ, డా. కె.భాస్కర్, డా.ఎల్ తిరుపతి, లతా రాణి, డా.ఆనంద్, డా.నాగరాజ్ డా.కీర్తి చంద్ర, డా.సుదక్షణ డా.రవికుమార్, డా. దయానంద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం-ఎన్నికలపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రకాశం ఇనిస్టిట్యూట్ డెవలప్ మెంట్ స్టడీస్ ట్రెజరర్ రాజశేఖర్, శ్రీకాంత్ బహుమతులు అందించారు.