• ఈవీఎం, వీవీ ప్యాట్‌ అవగాహన కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

వేద న్యూస్, వరంగల్ :

జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ యంత్రం, వీవీ ప్యాట్‌ల వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీ ప్యాట్‌ అవగాహన కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో ఏనుమాముల గో డౌన్ లో శిక్షణ కోసం  భద్రపరచిన రిజర్వ్ ఈవీఎం యంత్రాల్లో 8 యంత్రాలను, వీవీ ప్యాట్లను తీసి ఆయా నియోజకవర్గ ఈ ఆర్ ఓ లను కేటాయించినట్లు తెలిపారు.

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంతో పాటు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయం పరిధులైన వరంగల్ జిడబ్ల్యూఎంసీ కార్యాలయంలో, నర్సంపేట తహసీల్దార్ కార్యాలయంలో, వర్షన్నపేట బస్ స్టేషన్ లలో అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేససినట్లు తెలిపారు.

జిల్లాలో ముఖ్యమైన ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం మన హక్కు అని, ఈ వీఎం యంత్రాలు, వీవీ ప్యాట్‌ల ద్వారా ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలనే దానిపై జిల్లాలోని ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసు చంద్ర, స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి, డిపిఆర్ ఓ ఆయూబ్ అలీ, కలెక్టరేట్‌ ఏవో శ్రీకాంత్, జిల్లా ఇన్ఫోర్మ్యాటిక్ అధికారి అప్పిరెడ్డి, పర్యవేక్షకులు విశ్వ నారాయణ, జగదీష్, సదానందం, రమేష్ కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు