వేద న్యూస్, వరంగల్ :

సమగ్ర కుటుంబ సర్వేలో ఏ ఒక్క ఇంటిని మినాయించకుండా పక్కాగా సర్వే నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా నిర్వాహకులకు ఆదేశించారు. గురువారం నర్సంపేట మునిసిపల్ పరిధిలోని 8వ వార్డు లో, ఖానాపూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర కుటుంబ సర్వే ను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గణకులు కుటుంబ వివరాలు నమోదు చేస్తుండగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇంటింటి కుటుంబ సర్వేలో సమగ్ర సమాచారాన్ని సేకరించాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్వేలో ప్రతి ఎన్యూమరేటర్ సగటున 15 ఇండ్ల వివరాలు నమోదు చేయాలని అన్నారు. సర్వే జరుగుతున్న సమయంలో కుటుంబ యజమానికి వారి వద్ద నుంచి సేకరించే సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని, వారికి అర్థం అయ్యే విధంగా తెలియజేయాలని సూచించారు.

సర్వే నమోదు వివరాలను క్షుణ్ణంగా పర్యవేక్షణ చేయాలని సూపర్వైజర్ లను ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో జెడ్పి సీఈఓ రామిరెడ్డి, సిపిఓ గోవిందరాజన్, డిఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓ ఉమారాణి, ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్,మండల ప్రత్యేక అధికారి భాగ్యలక్ష్మి, మునిసిపల్ కమిషనర్ జోనా, తహశీల్దార్లు, ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.