- డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్, పేదల డాక్టర్ గా పేరుగాంచిన పెరుమాండ్ల రామకృష్ణకు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ లోక్ సభ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించి..టికెట్‌ను కేటాయించాలని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్)జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ కోరారు. గురువారం హనుమకొండలోని ఏకశిలా పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత రెండు దశాబ్దాలుగా డాక్టర్ రామకృష్ణ ఒకపక్క వృత్తిపరంగా వైద్య రంగంలో డాక్టర్ గా స్థిరపడి పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూనే, మరో పక్క పూలే, అంబేడ్కర్ మొదలగు మహనీయుల స్ఫూర్తితో సమాజంలోని అనేక అసమానతలపై, సమస్యలపై అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల తరఫున ప్రశ్నించే గొంతుకగా నిలిచారనని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా కొనసాగుతూ పార్టీకి కూడా అంకిత భావంతో సేవ చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తన వంతు కృషి చేశారని వివరించారు.
కావున రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. కార్యక్రమంలో డిబిఎఫ్ నాయకులు మంద నవీన్, లింగాల రాజన్ బాబు, వేల్పగొండ నరసింహ రావు, మేకల ఆనందం, చిలువేరు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.