- జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి
వేద న్యూస్, హుజురాబాద్:
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని జన్వాడ గ్రామంలో ఇటీవల చర్చి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి అన్నారు. హుజురాబాద్ పట్టణంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగం అమల్లో ఉన్న విషయాన్ని ప్రతీ ఒక్క రాజకీయ పార్టీ, పార్టీల్లో పనిచేస్తున్న శ్రేణులు, సంఘాలు, సంస్థలు గుర్తుంచుకోవాలని సూచించారు.
ఈ దేశంలో మను వాదానికి తావు ఇవ్వకూడదని రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు మనువాదం ఎక్కడిదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మూకలు జన్వాడ గ్రామంలోని చర్చిలో ప్రవేశించి అక్కడున్న వారిని తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తూ..ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశం పూర్తిగా ప్రజాస్వామ్య దేశం అని..రాజరిక వ్యవస్థ కాదనే విషయాన్ని గుర్తుంచుకొని భారత దేశ ప్రతీ పౌరుడు రాజ్యాంగానికి లోబడి జీవించాలని అన్నారు. అన్ని మతాలను, కులాలను సమాజంలో సమంగా గౌరవించాలన్నారు.
తినే ఆహారపు అలవాట్ల మీద ప్రజలు పాటించే సంస్కృతి మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ పెత్తనం ఏంటి ? అని ఆయన ప్రశ్నించారు. మైనార్టీ వర్గాలైన క్రిస్టియన్ల పై ముస్లింలపై బడుగు బలహీన వర్గాలపై కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి దాడులు దేశంలో రోజురోజుకూ పెట్రేగిపోతున్నాయని విమర్శించారు. దాడులు జరిగిన ప్రతి ప్రాంతంలో కేసులు నమోదు చేసి శిక్ష పడేలా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వాసు వడ్లూరి డిమాండ్ చేశారు.
జన్వాడ చర్చి పై దాడులు చేసిన వారిని గుర్తించి వెంటనే కేసులు నమోదు చేసి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించాలన్నారు. దాడి జరిగిన విషయాన్ని తెలుసుకొని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శకు వెళితే అక్రమంగా అరెస్టు చేశారని..ఆ అక్రమ అరెస్టులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వాసు వడ్లూరి వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ సీనియర్ నాయకులు సంధ్యేల వెంకన్న, చల్లూరి రాజు, గాజే రాజ్ కుమార్, ఆకునూరి అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు.