- అందరి చూపు ఈ స్థానం వైపు
- అధికార కాంగ్రెస్ పార్టీలో అధికంగా ఆశావహులు
- అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్యతో పాటు పలువురి పేర్లు తెరపైకి
- కాంగ్రెస్ పార్టీ వరంగల్ లోక్ సభ సీటుపై అంతటా జోరుగా చర్చ
- పొత్తులో భాగంగా ఈ సీటుపై ఫోకస్ పెడుతూ..ప్రతిపాదిస్తున్న సీపీఐ
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచి సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిచి చూపించాలనే లక్ష్యంతో అందుకు ప్రణాళికలు రచించుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం త్వరలో ఇంద్రవెల్లి నుంచి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీగా బరిలో నిలిచేందుకు ఆశావహులు ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో తలమూనకలయ్యారు. ముఖ్యంగా ఇప్పుడు అందరి చూపు వరంగల్ లోక్ సభ సీటుపైన పడిందని చెప్పొచ్చు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. ఈ క్రమంలో వరంగల్ లోక్ సభ స్థానం సైతం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో విజయంగా నమోదవుతుందని హస్తం పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
హాట్ సీట్ గా మారిన వరంగల్ ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిచేందుకు అరడజను మందికిపై గా ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. సేవా సమీకరణాలతో పాటు రాజకీయ నేపథ్యం, కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో చేసిన పనులు..గెలుపు అంచనాలు వేసుకుని ఆశావహులు ఎవరికి వారు పోటీకి సై అంటున్నారు. అధిష్టానం పెద్దలతో పాటు మంత్రులను కలుస్తూ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుంటే చాలు..గెలుపు ఖాయమనే అభిప్రాయంలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు పొత్తులో భాగంగా ఈ సీటును తమకు కేటాయించాలనే ప్రతిపాదనను సీపీఐ వారు తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై వారు చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. సీనియర్ జర్నలిస్ట్ బీఆర్ లెనిన్ పేరును కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా అభ్యర్థిగా బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే..వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అరడజనుకుపైనే ఉంది. డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, దొమ్మాటి సాంబయ్య, కూరాకుల భారతి వంటి వారు టికెట్ ఆశిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, అద్దంకి దయాకర్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తుంగతుర్తి టికెట్ వదిలేసుకున్న హస్తం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఆయనను వరంగల్ పార్లమెంట్ నుంచి బరిలో నిలపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరు గాంచిన అద్దంకి దయాకర్ కు వరంగల్ లోక్ సభ టికెట్ కన్ఫర్మ్ అనే టాక్ కూడా వినబడుతోంది. ఇటీవల ఎమ్మెల్సీగా తొలుత అద్దంకి దయాకర్ పేరు వినబడినప్పటికీ చివరకు ఆయన పేరు లేదు. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ఆయనను పార్లమెంట్ బరిలో నిలపాలనే వాదనను పలువురు తెరమీదకు తీసుకొస్తున్నారు.
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరు సైతం ప్రముఖంగానే వినబడుతోంది. వరంగల్ ఎంపీగా గతంలో ప్రాతినిథ్యం వహించిన అనుభవంతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలతో సిరిసిల్ల రాజయ్యకు ఉన్న సత్సంబంధాలు ఆయన గెలుపునకు దోహదపడతాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కష్టకాలంలోనూ కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకుని హస్తం పార్టీ శ్రేణులకు అండగా నిలిచిన రాజయ్యకు టికెట్ ఇవ్వాలని శ్రేణులు అంటున్నాయి.
జనం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్యాయంగా ‘బాపు’ అని పిలుచుకునే సిరిసిల్ల రాజయ్యను ఈ సారి వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా బరిలో నిలిపితే గెలుపు ఖాయమని రాజయ్య వర్గీయులు పేర్కొంటున్నారు.2009-2014 సమయంలో వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన సిరిసిల్ల రాజయ్య..2014 సార్వత్రిక ఎన్నికల్లో కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయారు. అనంతరం శ్రీహరి రాజీనామా చేయడంతో సిరిసిల్ల రాజయ్యను ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. కానీ, రాజయ్య నివాసంలో జరిగిన అగ్నిప్రమాద నేపథ్యంలో రాజయ్య పోటీ చేయలేదు. ఇక ఇప్పుడు 2024 పార్లమెంటు ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ కేటాయిస్తారో లేదో చూడాలి మరి..
పేదల డాక్టర్ గా పేరొందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తనకు వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించాలని ఇప్పటికే పార్టీ అగ్రనాయకులతో పాటు అధిష్టాన పెద్దలను కలుస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ల గెలుపులో తాను తన వంతు పాత్ర పోషించానని పేర్కొంటున్నారు. వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ గా నిత్యం ప్రజల్లో ఉంటూ..కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలుస్తూ..ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చూడాలి మరి..కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరికి ఎవరికి టికెట్ కేటాయిస్తుందో..