వేద న్యూస్, మరిపెడ:
తాను నమ్మిన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నమ్ముకున్న కార్యకర్తలకు కష్టం కాలంలో అండగా ఉంటానని మరిపెడ బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక సీనియర్ నేత, జిల్లా నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ‘గులాబీ’ కార్యకర్తలు, లీడర్లకు భరోసా ఇచ్చారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడి ఎటు వెళ్లడం లేదని క్లారిటీనిచ్చారు.
సోషల్ మీడియాలో, కొన్ని పత్రికలలో వస్తున్న దుష్ప్రచారాలను బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పలువురు అధికారపార్టీ నేతలతో తనకు సత్సంబంధాలు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి పార్టీ కోసం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాను ఏ ఇతర పార్టీలోకి వెళ్లడం లేదని, తెలంగాణ తొలి సీఎం కేసిఆర్ సిద్ధాంతాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగుతానని వెల్లడించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్న మాలోతు కవిత గెలుపునకు కృషి చేస్తానని పేర్కొన్నారు. లీడర్లు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని సూచించారు.