• హస్తం గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ప్రచారపర్వం
  • ఎలగందులపై మూడు రంగుల జెండా ఎగరవేసేందుకు అన్నీతానైన మంత్రి
  •  ఇన్‌చార్జిగా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ప్రచారం హోరెత్తిస్తున్న నేత
  •  పొన్నం ప్రభాకర్ భుజస్కందాలపై కరీంనగర్ క్యాంపెయిన్
  •  లోక్‌సభ అభ్యర్థి రాజేందర్‌రావుకు మద్దతుగా కాంగ్రెస్ లీడర్లు, కేడర్
  •  ‘కోహినూర్ కరీంనగర్’ పేరిట వెలిచాల..23 సొంత గ్యారెంటీలు

వేద న్యూస్, కరీంనగర్:

కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ‘చేతి’కి చిక్కేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెడుతోంది. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నీ తానై లోక్ సభ క్యాంపెయిన్‌లో ముందు వరుసలో నిలుస్తూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల మద్దతు, ముఖ్య కాంగ్రెస్ లీడర్ల సహకారంతో ఎలగందుల పార్లమెంటుపై హస్తం పార్టీ జెండా ఎగురవేసేందుకు క్షేత్రస్థాయిలో ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్ కేడర్‌ను సమాయత్తపరుస్తూనే ఇతర పార్టీల శ్రేణులు, ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రణాళికలను అమలు చేస్తున్నారు.

పవర్ ప్లే!
ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరి రోజులు మాత్రమే గడువు ఉన్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధిష్టానం ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్..లోక్‌సభ అభ్యర్థి గెలుపునకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. క్యాంపెయిన్‌ను రసవత్తరంగా మార్చేలా హాట్ కామెంట్స్ చేస్తుండటంతో పాటు ప్రత్యర్థి పార్టీల కేడర్‌ను కూడా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ వద్ద ఉండే సెకండ్ కేడర్ లీడర్లు, కార్యకర్తలను హస్తం గూటికి తీసుకొచ్చేలా ఇంటర్నల్‌గా చర్చలు జరుపుతున్నట్టు టాక్. మహిళలకు ఫ్రీ బస్, రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు బిల్లు వంటి గ్యారెంటీల అమలు నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన కాంగ్రెస్ నేతలకు లభిస్తోంది.

ఏఐసీసీ ఫుల్ ఫోకస్
కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీల బీజేపీ నేతలతో ఎంపీ బండి అభ్యర్థి సంజయ్ కుమార్‌కు కొంత గ్యాంప్ ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ ఉంది. ఈ క్రమంలో ఆ గ్యాప్ ను బేస్ చేసుకొని వారితో మాట్లాడి వారిని హస్తం పార్టీ వైపు మొగ్గు చూపేలా లీడర్లు సంప్రదింపులు జరుపుతున్నట్టు వినికిడి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చేరికలకు కాంగ్రెస్ కేంద్రనాయకత్వం ఓకే చెప్పడంతో పాటు ఏఐసీసీ ఫుల్ ఫోకస్ ఈ సెగ్మెంట్ పైన పెట్టినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

పెద్ద ఎత్తున చేరికలు
ఎలగందుల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీల ఇతర పార్టీల లీడర్లు, కార్యకర్తల చేరికలు జిల్లా మంత్రి, ఆ సెగ్మెంట్ ఎమ్మెల్యే లేదా కాంగ్రెస్ ఇన్ చార్జిల సమక్షంలో పెద్దఎత్తున జరుగుతుండటం గమనార్హం. ఇవన్నీ కూడా లోక్ సభ అభ్యర్థి గెలుపునకు తోడ్పడటంతో పాటు పార్టీ బలోపేతానికి ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్ఠం చేసుకోవడంతో పాటు ఓటు బ్యాంకును కూడగట్టుకోవడం ఈజీ అవుతుంది.

దీనికి తోడు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మెజారిటీ స్థానాలు నాలుగు సెగ్మెంట్లను అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేజిక్కించుకుంది. దానికి తోడు స్టేట్‌లో అధికారంలోకి వచ్చింది. జిల్లా మంత్రిగా పొన్నం ప్రభాకర్ పూర్తిస్థాయిలో జిల్లా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. జిల్లా పరిధిలోని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మిగతా మూడు నియోజకవర్గాల్లో ఇన్ చార్జిల పూర్తి సహకారం, మద్దతు లోక్‌సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు లభిస్తుండటం ద్వారా గెలుపు మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయాలు కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. కరీంనగర్ గడ్డాపై ఎగరబోయేది కాంగ్రెస్ జెండానేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

సమస్యల పరిష్కారానికి ‘కరీంనగర్ సహాయక్ యాప్’..
కరీంనగర్ ‘చేతి’కి మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిలు బలంగా మారారు. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కు సానుకూల పవనాలకు తోడు అసెంబ్లీ ఎన్నికల నాటి ఆరు గ్యారెంటీలతో పాటు ‘కోహినూర్ కరీంనగర్’ పేరిట లోక్ సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ‘వెలిచాల విజన్’ అని పేర్కొంటూ 23 సొంత గ్యారెంటీలను రిలీజ్ చేశారు.

కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి ‘కరీంనగర్ సహాయక్ యాప్’, స్టూడెంట్స్ కు పోటీ పరీక్షలకు శిక్షణ, మెగా జాబ్ క్యాంప్స్, ఫ్రీ హెల్త్ క్యాంప్స్, సామూహిక వివాహాలు, ఉచిత డ్రైవింగ్ స్కూల్స్ వంటి 23 గ్యారెంటీలు వెలిచాల ప్రకటించారు. చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారైనప్పటికీ ప్రచారంలో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సెగ్మెంట్ పరిధిలో ఉచితంగా జేసీబీ, ట్రాక్టర్, పంటకోత యంత్రాలు, డ్రోన్లు, రోడ్డు రోలర్ ఇస్తానని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రముఖ ప్రజాప్రతినిధిగా పేరుగాంచిన జగపతిరావు తనయుడు రాజేందర్ రావు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ లోక్ సభ బరిలో దిగి రాజేందర్ రావు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.