•  త్వరలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ, హై స్కూల్ లకు నూతన బిల్డింగ్ నిర్మాణం
  •  మంత్రి కొండా సురేఖ చొరవతో త్వరలో సాకారమవనున్న విద్యార్థుల కల
  • రూ. 5.98 కోట్ల సిఎస్ఆర్ నిధులతో రూపుదాల్చనున్న నూతన భవనం

వేద న్యూస్, వరంగల్ :

మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండా మురళీధర్ రావు ప్రత్యేక చొరవతో వరంగల్ జిల్లా స్టేషన్ రోడ్ లోని కృష్ణ కాలనీలో వున్న ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ, హై స్కూల్ లకు త్వరలో నూతన బిల్డింగ్ కాంప్లెక్స్ రూపుదిద్దుకోనుంది. గత ఆగస్టు నెలలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ, హై స్కూల్ ను తనిఖీ చేసిన మురళీధర్ రావు 70 ఏళ్ళకు పైగా సేవలందిస్తూ వస్తున్న ఆ విద్యాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించారు.

గోడలు, తరగతి గదులు మన్నికను కోల్పోయి, పెచ్చులూడి, వర్షపు నీటి నిల్వతో దుస్థితికి చేరుకున్న తీరును, విద్యార్థుల పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకుని, పాత బిల్డింగ్ స్థానంలో నూతన బిల్డింగ్ నిర్మాణం చేపట్టి, విద్యార్థులను కష్టాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ దిశగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ స్వయంగా దృష్టి సారించి, కార్యాచరణను ప్రారంభించారు.

ఇందుకు అవసరమైన నిధులను సిఎస్ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటి) ద్వారా సమీకరించి, త్వరలో నూతన బిల్డింగ్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకుగాను కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. జూనియర్ కాలేజీ నిర్మాణానికి రూ. 4.5 కోట్లు, హై స్కూల్ నిర్మాణానికి రూ. 1.48 కోట్లతో మొత్తం రూ. 5.98 కోట్లతో వీటి కోసం నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అంచనా ప్రణాళికలను సిద్ధం చేసింది.

సిఎస్ఆర్ నిధులను సమీకరించిన వెంటనే నూతన బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. కొత్త బిల్డింగ్ నిర్మాణంతో తమ సమస్యలు తీరనుండటంతో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ, హై స్కూల్ విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు నెలల్లోనే నూతన బిల్డింగ్ నిర్మాణానికి కృషి చేసి, తమ కలను సాకారం చేసిన మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ రావు, మంత్రి సురేఖ దంపతులకు విద్యార్థులు, వరంగల్ తూర్పు ప్రజలు రుణపడి వుంటారని వారంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నూతన బిల్డింగ్ నిర్మాణం దిశగా కార్యాచరణను వేగవంతం చేసినందుకుగాను ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ శరదృతి, హై స్కూల్ హెడ్ మాస్టర్ అశోక్ కుమార్ హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో మంత్రి కొండా సురేఖ గారిని వారి కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు, వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తూనే వుంటామని మంత్రి సురేఖ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దే దిశగా పట్టుబట్టి ఒక్కో అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతూ, వరంగల్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యేలా శ్రమిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.