– రిటైర్డ్ అటవీ జిల్లా అధికారి పురుషోత్తం
– జూలాజికల్ పార్క్ అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకం
– చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ బీమా
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
అటవీ ఆవాసం లేకపోతే మానవ అభివృద్ధి ఆగిపోతుందని రిటైర్డ్ అటవీ జిల్లా అధికారి కాజీపేట పురుషోత్తం చెప్పారు. శనివారం వరంగల్ లోని కాకతీయ జూలాజికల్ పార్కులో జాతీయ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అక్టోబరు 2-8వ తేదీ వరకు దేశమంతటా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా అడవుల సంరక్షణ, జంతువుల పట్ల దయా, కరుణ గురించి ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కల్పిస్తారు. ఈ 69 వ జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను అక్టోబర్ రెండో తేదీన మొదలై అక్టోబర్ 8న కాకతీయ జూలాజికల్ పార్క్, హంటర్ రోడ్, హనుమకొండ లో ఘనంగా ముగింపు కార్యక్రమం ఉంటుంది. ముగింపు వేడుకల్లో చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీమా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆ కార్యక్రమానికి హనుమకొండ డీఎఫ్ఓ బి.లావణ్య ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.
ఈ వన్యప్రాణి వారోత్సవాల థీమ్ “వన్యప్రాణుల సంరక్షణ కోసం భాగస్వామ్యాలు” కాగా, శనివారం జరిగిన కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ అధికారి, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీమా మాట్లాడుతూ..జూలాజికల్ పార్కు అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని అన్నారు. డిఎఫ్ఓ లావణ్య మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం లాగే ఈ వేడుకలు జరుపుకుంటున్నామని చెప్పారు. అయితే ఈ సంవత్సరము మరికొన్ని స్వచ్ఛంద సంస్థలను ఆహ్వానించి వారి నుండి ప్రకృతి, పర్యావరణము, అడవులను అడవి జంతువుల పట్ల దయను అడవి ఆవాసాలను కాపాడుకోవాలని సూచించామని పేర్కొన్నారు. జూపార్క్ లోని జంతువులను అడాప్టేషన్ చేసుకోవాలని కోరినట్లు వివరించారు. స్పందించిన స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన విధంగా జూ పార్క్ లో ఉన్న కొన్ని జంతువులను అడాప్షన్ చేసుకున్నాయని స్పష్టం చేశారు. ఇంకొందరు స్కూల్ విద్యార్థులు కూడా ముందుకు వచ్చి తాము కూడా చిన్న జంతువులను అడాప్షన్ చేసుకుంటామని తెలిపినట్లు వివరించారు.
అడవులను రక్షించుకోకపోతే భవిష్యత్తు అంధకారం: రవిబాబు
అటవీ విజిలెన్స్ డిఎఫ్ఓ నాగభూషణం మాట్లాడుతూ ఈ బాధ్యత ఒక ప్రభుత్వ అధికారులది, ఫారెస్ట్ అధికారులదే కాదు ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యమైనదని వివరించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి రిటైర్డ్ అటవీ జిల్లా అధికారి కాజీపేట పురుషోత్తం మాట్లాడుతూ అటవీ ఆవాసం అనుగడ లేకపోతే మానవ అభివృద్ధి ఆగిపోతుందని చెప్పారు. రాబోవు తరాలకు మనము ఏమి ఇవ్వలేమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అడవుల రక్షణ పై ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛంద సంస్థ “ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ”కి చెందిన పర్యావరణవేత్త పిట్టల రవిబాబు మాట్లాడుతూ అడవులు అడవి ఆవాసాలను రోజురోజుకూ క్షీణించి పోతున్నాయని చెప్పారు. వాటిని ఒక దృఢమైన సంకల్పంతో, ప్రజల భాగ్యస్వామ్యంతో ప్రభుత్వాలు రక్షించకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు. పూర్తిగా ఈ భూమి భూమిపై ఉన్న అడవులు మానవునిచే ఆక్రమించబడుతున్నాయని, అడవులు రోజుకు రోజుకూ తరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే రకంగా అందరూ చూసుకుంటూ ఉంటే ఈ భూమి మీద ఏదో ఒక రోజు అసలు అడవులే ఉండవని, అడవి జంతువులు కోల్పోయిన ఆ అడవి ఆవాసాల ఆహారపు గొలుసు లోపల తేడా వచ్చి సమతుల్యత కోల్పోయి అసమతుల్యత ఏర్పడుతుందని వాపోయారు.
అనిమల్ అడాప్షన్ గొప్ప సేవ: రాజ్ కుమార్
“వన సేవా సొసైటీ ఎన్జీవో” నుంచి అడ్వకేట్ పొట్లపల్లి వీరభద్ర రావు హాజరై మాట్లాడుతూ అడవి జంతువులను అడాప్టేషన్ చేసుకున్నట్లయితే వారికి ప్రభుత్వం నుండి ఇన్కమ్ టాక్స్ 80జి కింద రాయితీ లభిస్తుందని చెప్పారు. “ప్రగళ్లపాటి ప్రకాశం ఫౌండేషన్” ఎన్జీవో ఫౌండర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ అనిమల్ అడాప్షన్ అనేది చాలా గొప్ప సేవ అని పేర్కొన్నారు. జూలో ఉన్న నోరులేని జంతువులను అడాప్షన్ చేసుకున్నట్లయితే మనము ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి, అనేకమంది చూసేట్టుగా వీలు కల్పించినట్లు అవుతుందని వివరించారు. ఇది కూడా గొప్ప సామాజిక సేవ అని ఆయన పేర్కొన్నారు. తమ ఫౌండేషన్ పేరు పై ఒక జంతువును ఇదే వేదికపై అడాప్షన్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
జంతువులపై ప్రేమను వ్యక్తపరచొచ్చు: వేణు
జన విజ్ఞాన వేదిక ఎన్జీవో నుండి పరికిపండ్ల వేణు హాజరై మాట్లాడుతూ అనిమల్ అడాప్షన్ అనేది చాలా మంచి కార్యక్రమమని చెప్పారు. దాని ద్వారా జంతువులపై ప్రేమను మనము వ్యక్తపరిచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తమ ఆదర్శ కాలనీ సొసైటీ నుంచి ఒక ముఖ్యమైన జంతువును అడాప్షన్ చేసుకుంటున్నామని ప్రకటించారు. ఆహ్వానితులుగా విచ్చేసిన లైన్స్ క్లబ్, రోటరీ క్లబ్స్ వారు కూడా 10కి మించి జంతువులను అడాప్షన్ చేసుకొని వారి సేవా తత్పరతను వ్యక్తపరిచారు.
జంతు రక్షణ పర్యవేక్షణ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎనిమల్ అడాప్షన్ ఇతరులకు ఆదర్శం అవుతుందని చెప్పారు. తద్వారా పర్యావరణాన్ని పై మంచి అవగాహన కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వాళ్లు తదితరులు పాల్గొన్నారు.