- అభాగ్యులకు దుప్పట్లు అందజేసిన ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్
వేద న్యూస్, సుల్తానాబాద్:
యువ సంకల్ప ఫౌండేషన్ యువకులు మానవత్వాన్ని చాటారు. చలితో వణుకుతున్న వారికి తోచిన సహాయం చేయాలని ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సుల్తానాబాద్ పట్టణంలోని యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రతీ సంవత్సరం చలికాలంలో రోడ్డుపై చలితో వణుకుతున్న అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా అందరూ ఫౌండేషన్ వారిని అభినందించారు.
సుల్తానాబాద్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ముగ్గురు అభాగ్యులు చలికి వణుకుతున్న దృశ్యాన్ని చూసి చలించిన యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్.. వారికి వెంటనే దుప్పట్లు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
ఆపన్న హస్తం కోసం చూస్తున్న అభాగ్యులను ప్రతీ ఒక్కరు ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ చలికాలం ప్రారంభమై ఎముకలు కొరికే చలిలో వీరు రాత్రి వేళలో నిద్రిస్తున్నారని, వారి దుస్థితిని చూసి చలించిపోయి దుప్పట్లు అందజేసినట్లు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి అభాగ్యులు ఎక్కడ కనిపించినా వారికి దుప్పట్లు అందజేసి కనీసం ఒక్క పూట నైనా భోజనం అందించాలని కోరారు. కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు తుమ్మ నిశాంత్, వెంకటేష్, ఆషాడపు క్రాంతి, నాగమల్ల ప్రశాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.