– వరంగల్ తూర్పు బరిలో అల్లం

– బీజేపీ అనుబంధ సంస్థ నేతగా, వకీల్ సాబ్‌గా గుర్తింపు

– ఉద్యమకారుడిగా కీలక పాత్ర పోషించిన నాగరాజు

– బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఇటీవల దరఖాస్తు…

-వరంగల్ ఈస్ట్ బీజేపీ టికెట్‌పై హోప్స్

వేద న్యూస్, వరంగల్:

అవసరాల కోసం పార్టీలు మారే నేతలున్న ఈ రోజుల్లో ప్రజావసరాలు, సమస్యల పరిష్కారం, నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసే నేతలు ఉండటం గొప్ప విషయమే. ఈ కోవకు చెందిన నాయకుడిగా అల్లం నాగరాజు కొనసాగుతున్నారు. సిద్ధాంతం ప్రకారం పని చేయాలని, రాజకీయాలు ప్రజలకు మంచి చేసేందుకు ఉండాలనే భావించే వకీల్ సాబ్..అల్లం నాగరాజు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన వంతుగా క్రియాశీలక పాత్ర పోషించిన నాగరాజు..రాబోయే ఎన్నికల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజల తరఫున సమస్యలను రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించాలని అనుకుంటున్నారు.

 

వరంగల్ తూర్పు బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న అల్లం నాగరాజుకు టికెట్ తప్పక లభిస్తుందని ఆయన అనుయూయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడిగా ప్రారంభమై వకీల్ సాబ్ గా గుర్తింపు పొందిన ఆయనకు సమాజంపై చక్కటి అవగాహన ఉందని, అలాంటి వ్యక్తి నాయకుడిగా గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అజాతశత్రువుగా నాగరాజుకు పేరు

ఖిలా వరంగల్ తూర్పు కోట ముద్దుబిడ్డ నాగరాజు విద్యాభ్యాసం మహబూబియా స్కూల్ లో జరగగా, ఎల్బీ కాలేజీలో డిగ్రీ, పీజీ, కేయూలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ నుంచి ఏబీవీపీలో కొనసాగిన నాగరాజు మొదటి నుంచి ఒకటే సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తు్న్నారు. సామాజిక కార్యకర్తగా పలు కార్యక్రమాలు చేపట్టిన నాగరాజు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టి రాణించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో న్యాయవాదిగా నాగరాజు ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఢిల్లీకి వంద మంది న్యాయవాదులను తరలించడంతో పాటు రాస్తారోకోలు, రైలు రోకో, వంటావార్పూ కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ భావనను గల్లీ గల్లీ వ్యాపించేలా తన వంతు పాత్రను పోషించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యమంలో అక్రమంగా విద్యార్థులపైన నమోదైన కేసులను వాదించేందుకు నాగరాజు ముందుకొచ్చారు. ఉచితంగానే న్యాయవాద సేవలు విద్యార్థుల కోసం అందంచారు. ఏబీవీపీతో అనుబంధం కలిగి ఉండి బీజేపీ నేతగా ఉన్నప్పటికీ అన్ని కుల సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కలిగిన అజాతశత్రువుగా నాగరాజుకు పేరుంది. పార్టీలకతీతంగా అన్ని కుల సంఘాలను, విద్యార్థి సంఘాలను, ప్రజా సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇటీవల ‘బీసీలకు రాజ్యాధికారం’ అనే నినాదంపై భారీ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సు నిర్వహణలో అల్లం నాగరాజు పాత్ర అతి కీలకమని చెప్పొచ్చు. విద్యార్థి దశ నుంచే హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పడుతూ ఏబీవీపీ కార్యక్రమాలను నాగరాజు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అతి పెద్ద గోశాలను ‘వశిష్టి సూర్య’ పేరుతో పంథిని-కక్కిరాలపల్లిలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతీనెల రెండు సార్లు యాగం నిర్వహిస్తుండటం విశేషం. దీనిని ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, అధ్యాత్మిక గురువులు సందర్శించారు. అల్లం నాగరాజు వ్యక్తిగత జీవితంతో పాటు వ్యక్తిత్వం, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు, అనుభవం వంటి విషయాలు ఆయనకు బీజేపీ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే టికెట్ వచ్చేందుకు సానుకూల అంశాలుగా కనబడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.