BR / Vedha News
తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన అమిత్ షా
దక్షిణాదిలో బీజేపీ విస్తరణకు కమలనాథుల స్ట్రాటజీ
దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి మాస్టర్ ప్లాన్
తెలంగాణ లేదా తమిళనాడు నుంచి ఎంపీగా ప్రధాని మోడీ పోటీ?
ప్రస్తుతం కేంద్రంతో పాటు అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే సాధారణ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ లేదా తమిళనాడు నుంచి లోక్ సభ ఎంపీగా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం. బీజేపీ అగ్రనేత అమిత్ షా వ్యూహం ప్రకారం ఈ ప్రణాళిక అమలు చేయాలని యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
తెలంగాణలో జోష్..
బీజేపీ తెలంగాణలో ఇప్పటికే గతం కంటే బాగా బలపడింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ తెలంగాణలోని పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వార్త తెలుసుకుని ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అలా చేస్తే కనుక తెలంగాణలో అత్యధిక అసెంబ్లీ సీట్లు బీజేపీని గెలుచుకుంటుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ దక్షిణాదిన విస్తరించేందుకు ‘గేట్ వే’గా తెలంగాణ మారనుంది. తెలంగాణలోని పాలమూరు లోక్ సభ నియోజకవర్గం లేదా తమిళనాడులోని రామనాథపురం నుంచి ప్రధాని మోడీని బరిలో దింపే ఆలోచనలున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సారథ్యంలో పార్టీ పరుగులు తీస్తున్నది. ఇప్పటికే 5 విడతల పాదయాత్రను కంప్లీట్ చేసిన సంజయ్ ఆరో విడత పాదయాత్రకు సమాయత్తమవుతున్నారు. మొత్తంగా తెలంగాణలో రాజకీయ అధికారం చేజిక్కించుకునేందుకు కమలనాథులు తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. చూడాలి మరి.. ఈ వార్తలో నిజమెంతుందనేది తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.