ప్రత్యర్థులను తికమక పెట్టేందుకు మాస్టర్ ప్లాన్స్
మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎత్తుగడలు
రసకందాయంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల జోరు
.

కృష్ణ, వేద న్యూస్:

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే అప్రకటిత ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనబడుతున్నదని చెప్పొచ్చు. తెలంగాణ ఎన్నికల సంవత్సరం 2023లోకి అడుగు పెట్టగా, ఏపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది అంటే 2024లో ఎన్నికలు జరగనున్నాయి. అయినప్పటికీ అప్పుడే ఇరు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతున్నది. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీలు మాస్టర్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నాయి. చూడాలి మరి.. ఆ వ్యూహాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో.

పదునైన వ్యూహాలు..,

తెలంగాణలో అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ తన పార్టీ పేరును ఇటీవల ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్’గా మార్చారు. దాంతో ఆయన ఎంట్రీ ఏపీ రాజకీయాల్లో కన్ఫర్మ్ అయింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీ-టీడీపీని మళ్లీ యాక్టివేట్ చేసేందుకు అడుగులు వేస్తు్న్నారు. ముదిరాజ్ నేత కాసాని జ్ఞానేశ్వర్‌ను తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా నియమించి, పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే, ఏపీలోకి కేసీఆర్ ‘బీఆర్ఎస్’ ఎంట్రీ రాజకీయ ఎత్తుగడనేనా? అనే చర్చ అయితే పొలిటికల్ సర్కి్ల్స్‌లో జరుగుతున్నది. పవన్ కల్యాణ్‌ను దెబ్బతీయడానికి ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ సైతం క్షేత్రస్థాయిలో పని మొదలు పెట్టారు. ఈ నెల 12న వివేకానంద జయంతి సందర్భంగా ‘రణస్థలి’లో యువశక్తి తడాఖా చూపించేందుకు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ విషయానికొస్తే..వచ్చే ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులకు సూచిస్తున్నారు. అలా చేస్తే వచ్చే 30 ఏండ్లు అధికారంలో ఉండేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను కుప్పంలో పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికలు రచించుకుంటున్నాయి. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ఇప్పటికే 5 విడతలుగా పాదయాత్ర చేశారు. 6వ విడత పాదయాత్రకు రెడీ అవుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర చేయబోతున్నారు. వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల సైతం తెలంగాణ రాజకీయాల్లో కేంద్రబిందువుగా మారారు. ఆమె పాదయాత్ర నేపథ్యంలో జరిగిన దాడులు ఇతర విషయాలు చర్చనీయాంశమయ్యాయి. మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సైతం బీఎస్పీ తరఫున తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు రాజకీయాలు అప్పుడే వెరీ ఇంట్రెస్టింగ్ మారాయని, రానున్న రోజుల్లో సమీకరణాలు ఇంకా మారుతాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.