• ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

 

వేద న్యూస్, ఇల్లంతకుంట:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద ‘‘పోయిరా బతుకమ్మ…. మల్ల అచ్చే ఏడాది మళ్లీ రావమ్మా…’’ అంటూ మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా సోమవారం నిర్వహించారు.

 

తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. గ్రామాలలో మహిళలు రంగు రంగుల పూలు గునుగు, తంగేడు ,పట్టుకుచ్చు, బంతి, చామంతి పూలతో బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో పేర్చి మొదట వివిధ కూడళ్ల వద్ద బతుకమ్మను ఆడారు.

అనంతరం వాగుల వద్ద, బతుకమ్మ తెప్ప వద్దకు బారులు తీరి వాగులో ప్రవహిస్తున్న నీటితోపాటు తెప్పలో బతుకమ్మలను నిమజ్జనం చేసి ‘‘పోయిరా గౌరమ్మ పోయిరా’’ అంటూ పాటలు పాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.

అంతకుముందు వారి ఇండ్లలో గౌరీ దేవిని పూజించిన ఆడపడుచులు పసుపు కుంకుమలు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. సనాతనంగా వస్తున్న సాంప్రదాయంలో భాగంగా నిమజ్జనానికి తమ వెంట తెచ్చుకున్న పిండి పదార్థాలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్నారు.

యువతుల దాండియా, కోలాటాలు, బతుకమ్మ పాటలతో చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మండలంలోని వివిధ గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.