• పొన్నం ప్రభాకర్ సమక్షంలో పలువురు నాయకుల జాయినింగ్

వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండల పరిధిలో ‘హస్తం’ బలపడుతోంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో దూసుకెళ్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను తమ పార్టీలో చేర్చుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి ఎల్కతుర్తి మండలంలో బలం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. మండలపరిధిలోని అన్ని గ్రామాల్లో నాయకులు, ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ లీడర్లు సమన్వయంతో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.

హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ పేరును ప్రకటించిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. క్రమంగా పార్టీలో పట్టును నిలుపుకున్న పొన్నం..చేరికలతో నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకొస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయబోతున్నామని శ్రేణులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

బుధవారం పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామ నాయకులు పలువురు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కుడితాడి రమేశ్, శివాజీ, చంద్రాకర్ తో  పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పొన్నం ప్రభాకర్ హస్తం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.