వేద న్యూస్ , ఎల్కతుర్తి:
ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్‌లో కళానిలయం సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువందనం, ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కళలు, సాహిత్యం, సంస్కృతి, సేవా రంగాల్లో కళానిలయం సాంస్కృతిక సంఘ సేవా సంస్థ 26 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సముద్రాల వేణుగోపాలచారి హాజరై పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు.ఉపాధ్యాయులు, కళాకారులు, సాంస్కృతిక రంగ ప్రముఖులను గౌరవిస్తూ గురువందనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో రైతులకు సేవలందిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, రైతులకు మార్గదర్శకత్వం అందిస్తున్న రైతు సంఘాల నాయకులు హింగే భాస్కర్ సేవలను గుర్తించి స్వర్ణ నంది పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా హింగే భాస్కర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.వ్యవసాయ రంగంలో రైతులకు విశేష సేవలందిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న హింగే భాస్కర్‌కు స్వర్ణ నంది పురస్కారం లభించడం పట్ల పలువురు ప్రముఖులు, రైతు సంఘాల నాయకులు, అభిమానులు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా హింగే భాస్కర్ మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి స్వర్ణ నంది పురస్కారంతో సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్‌లో రైతులు, సమాజం కోసం తన వంతు సేవలను మరింత విస్తృతంగా కొనసాగిస్తానని తెలిపారు.
కళానిలయం సాంస్కృతిక సంఘ సేవా సంస్థ 26 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక, సాహిత్య, సేవా కార్యక్రమాలను వక్తలు ప్రత్యేకంగా ప్రశంసించారు.తనకు స్వర్ణ నంది పురస్కారం అందజేసి ఆత్మీయంగా సత్కరించిన కళానిలయం సాంస్కృతిక సంఘ సంస్థ నిర్వాహకులు, ఏ. సురేందర్ కు హింగే భాస్కర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, కళానిలయం సభ్యులు, ఉపాధ్యాయులు, కళాకారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
