వేద న్యూస్, డెస్క్ :
ఒకే దేశం, ఒకే ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి పలు సూచనలను కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన సైతం విడుదల చేసింది. ప్రజల నుంచి జనవరి 15 లోపు వచ్చే సూచనలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సూచనలు పంపాలనుకున్న వారు ప్యానెల్ వెబ్సైట్ onoe.gov.inలో పోస్ట్ చేయాలని లేదంటే sc-hlc@gov.inకు మెయిల్ చేయాలని తెలిపింది. గతేడాది సెప్టెంబర్లో ఏర్పాటైన రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇప్పటి వరకూ రెండు సార్లు సమావేశమైంది.
దేశంలోని 6 జాతీయ, 33 రాష్ట్ర పార్టీలతోపాటు 7 గుర్తింపు పొందని పార్టీల నుంచి ఇప్పటికే జమిలీ ఎన్నికలపై అభిప్రాయాలు కోరింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనపై ఒకరోజు పరస్పర చర్చను కోరుతూ ఇటీవల రాజకీయ పార్టీలకు లేఖ కూడా రాసింది. జమిలీ ఎన్నికలపై లా కమిషన్ అభిప్రాయాలను కూడా కమిటీ ఇప్పటికే తీసుకుంది.
కాగా లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకాకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం సిఫార్సులు చేయడానికి కోవింద్ కమిటీ ఏర్పాటైంది. గత సమావేశాల్లోనే ఈ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల అభిప్రాయలను స్వీకరిస్తామని చెప్పిన ఈ కమిటీ, తాజాగా సూచనలను ఆహ్వానించింది.
జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించే కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు కేంద్రం స్థానం కల్పించింది. కమిటీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి లు ఉన్నారు.