• అధికార, విపక్ష సభ్యుల బాహాబాహీ
  • నలుగురికి మంత్రి పదవుల కేటాయింపుపై రగడ

వేద న్యూస్, డెస్క్ : 

భారత్‌తో దూరం పెంచుకుంటున్న పొరుగుదేశం మాల్దీవులలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. దీన్ని ప్రతిబింబించే పరిణామాలు ఆదివారం మాల్దీవుల పార్లమెంటులో చోటుచేసుకున్నాయి. పార్లమెంటు సమావేశాలు వేదికగా పలువురు అధికార, విపక్ష సభ్యులు బాహాబాహీకి దిగారు.

సంస్కారం మరిచిపోయి.. సభలోనే ఒకరినొకరు కొట్టుకున్నారు. అసలు విషయం ఏమిటంటే.. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు తన మంత్రివర్గంలోకి తీసుకునేందుకు కొందరు అధికార పార్టీ ఎంపీలను ఎంపిక చేశారు.

మంత్రి పదవుల కోసం ఎంపికైన వారి పేర్లకు పార్లమెంటు ఆమోదాన్ని పొందేందుకు ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అయితే మంత్రి పదవుల కోసం ప్రతిపాదించిన నలుగురు ఎంపీల పేర్లను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష మాల్దీవీయిన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండీపీ) ఎంపీలు నిరసనకు దిగారు.

నలుగురు ఎంపీలను మంత్రులుగా చేసే ప్రతిపాదనను తిరస్కరించాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. వెంటనే రాజీనామా చేయాలని స్పీకర్‌ను కోరారు. సభా కార్యకలాపాలు నిర్వహించకుండా స్పీకర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈక్రమంలో ప్రతిపక్ష సభ్యులను అడ్డుకునేందుకు అధికారపార్టీ పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(పీఎన్సీ), ప్రభుత్వ అనుకూల పార్టీ ప్రొగ్రెసీవ్‌ పార్టీ ఆఫ్‌ మాల్దీవ్స్‌(పీపీఎం) ఎంపీలు యత్నించారు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. 

పిడిగుద్దులు.. తీవ్రగాయాలు

పీఎన్‌సీ ఎంపీ షహీమ్‌.. ఎండీపీ ఎంపీ ఇసా కాలు పట్టుకొని నేలపై పడగొట్టాడు. అనంతరం షహీమ్ మెడపై ఇసా పిడిగుద్దులు గుద్దాడు. సహచర ఎంపీలు అక్కడికి చేరుకొని వారి గొడవను శాంతింపజేశారు. తీవ్రంగా గాయపడ్డ షహీమ్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

కాగా, అధ్యక్షుడు ప్రతిపాదించిన ఎంపీలకు మంత్రి పదవులను కేటాయించకపోవడం అనేది ప్రజా సేవలకు విఘాతం కలిగించడమే అవుతుందని అధికార పీపుల్స్‌ నేషనల్‌ పార్టీ పేర్కొంది.

మాల్దీవుల పార్లమెంటులో ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీకి గణనీయమైన మెజారిటీ ఉంది. అందువల్లే నలుగురు ఎంపీలను మంత్రులు కాకుండా అడ్డుకోగలిగింది.