వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :
ఆధునికత పెరిగినా మహిళలపై అకృత్యాలు ఆగట్లేదు. వరకట్న వేధింపులకు తెరపడట్లేదు. తాజాగా వరకట్న వేధింపులు తాళలేక తన ఏడు నెలల బాలుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మృతురాలి కుటుంబ సభ్యులు, మిల్స్ కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లాకు చెందిన ఎస్.కె. అఫ్జల్ తన కుమార్తె తస్లీమ్(23)ను 20 నెలల కిందట వరంగల్ శంభునిపేటకు చెందిన ఎండీ తన్వీర్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో వరకట్నంగా రూ.1,50,000, మూడు తులాల బంగారం, 26 తులాల వెండి పెట్టారు. దీంతో పాటు ఒక ద్విచక్ర వాహనం కొనిస్తామని ఒప్పుకొన్నారు. దానికోసం షాదీ ముబారక్ పథకం ద్వారా వచ్చిన రూ.1 లక్ష ఇచ్చారు.
వాహనం కొనడానికి అదనంగా మరో రూ.26 వేలు కావాలని తన్వీర్ తరుచూ తస్లీమ్ ను వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 1న మరో సారి అదనపు కట్నం కోసం భర్త తన్వీర్ కొట్టడంతో తస్లీమ్ అదేరోజు సాయంత్రం 7 నెలల కుమారుడితో పర్వతగిరి మండలం అన్నారం దర్గా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పర్వతగిరి పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి ఎంజీఎం మార్చురీకి తరలించారు.
అయితే, మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదైన వివాహిత తస్లీమ్‌గా గుర్తించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆమె కుమారుడి కోసం మిల్స్ కాలనీ పోలీసులు జాలర్లు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం చిన్నారి తైమూర్ మృతదేహం లభ్యమైంది. కాగా, తల్లీకుమారుడి మృతికి వరకట్న వేధింపులే కారణం అని ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించారు. తస్లీమ్ భర్త ఎండీ తన్వీర్ తో కలిపి ఏడుగురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Thank you for being of assistance to me. I really loved this article.
thank you for your comments