వేద న్యూస్, జమ్మికుంట:
తెలంగాణ ప్రభుత్వ కళాశాల గెజిటెడ్ అధ్యాపక సంఘం రూపొందించిన డిగ్రీ అడ్మిషన్ల పోస్టర్ ను జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజశేఖర్ శనివారం కాలేజీ ప్రాంగణంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపక సంఘ రాష్ట్ర సెక్రటరీ డాక్టర్ కడారి సురేందర్ రెడ్డి ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు పెంపొందించేందుకు పోస్టర్లను రూపొందించి ప్రతీ కళాశాలకు అందజేస్తున్నారని తెలిపారు. వారు స్వయంగా అడ్మిషన్ల కోసం జూనియర్ కళాశాలను సందర్శిస్తున్నారని, వారి మార్గ దర్శకత్వంలో తమ ఆధ్యాపక బృంద సభ్యులు కూడా వివిధ జూనియర్ కళాశాలలను, అలాగే మోడల్ స్కూళ్లను సందర్శించి అడ్మిషన్లు పెంపొందించేందుకు విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తున్నారని వివరించారు.

ప్రభుత్వ కళాశాలలో పిహెచ్ డీ, నెట్, సెట్ అర్హత కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని పేర్కొన్నారు. టీఎస్ కేసి ద్వారా ఉద్యోగాలకు అవసరమయ్యే కంప్యూటర్ శిక్షణ, భాష నైపుణ్యాలను , ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న వ్యక్తిత్వ వికాసహాలను పెంపొందించడమే కాకుండా సామాజిక సేవ చేయడం విద్యార్థుల బాధ్యతగా ప్రభుత్వ కళాశాలలు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయని వారు కొనియాడారు. అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు.

గ్రంథాలయాల్లో ఇ-బుక్స్ అందుబాటులో ఉన్నాయని, యువతరంగం కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సాంస్కృతిక కళలను వెలికి తీయడం జరుగుతుందని స్పష్టం చేశారు. జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులను పరిశోధన వైపు అడుగులు వేసే విధంగా నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుందని అన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రగతికి సోపానాలు కాబట్టి ఇట్టి అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకొని..ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ సెక్రెటరీ, టిజిసిజిటిఏ కళాశాల యూనిట్ అధ్యక్షులు డాక్టర్ ఎం.రామ మోహన్ రావు , సెక్రటరీ రేణ ఈశ్వరయ్య, అధ్యాపకులు మహేందర్ రావు, డాక్టర్ బి. సువర్ణ, వి .స్వరూప రాణి, డాక్టర్ ఇ.రవి, ఎల్ .రవీందర్, దేవేందర్ రెడ్డి, మమత, అనూష, అరుణ్ రాజ్, సాయి ,శ్రీనివాస్ లైబ్రేరియన్ ఎ.భీమారావు విద్యార్థులు పాల్గొన్నారు.