వేద న్యూస్, హన్మకొండ/దామెర:
ప్రభుత్వ అధికారి అనగానే చాలు..వారు కేవలం తమ పని సమయాల్లో మాత్రమే కార్యాలయాల్లో ఉంటారని, తమ విధుల నిర్వహణ పట్ల కొంత అలసత్వం వహిస్తారనే భావన జనంలో ఉంది. కాగా, అలాంటి అపోహలకు తావివ్వకుండా విధి నిర్వహణలో సెలవు దినం కూడా పని చేస్తూ..పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు హన్మకొండ జిల్లా దామెర గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేశ్.
రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి అందరికీ విదితమే. అందులో భాగంగా ఆదివారం దామెర గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్..హాలీ డే రోజు కూడా విధులు నిర్వహించారు. దామెర మండలకేంద్రంలో తాగు నీటి సరఫరా కు సంబంధించిన పైప్ లైన్ లీకేజీల మరమ్మతులు, సైడ్ కాలువలు శుభ్రం చేయడం వంటి పనులు జరుగుతున్న తీరును పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఆయన పర్యవేక్షణలో సిబ్బంది పనులు చేపట్టారు. కాగా, ప్రభుత్వ అధికారులు ఇలా క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని గ్రామస్తులు పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమ నిర్వహణపై పంచాయతీ సెక్రెటరీ శ్రద్ధ వహించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని గ్రామాల్లోని అధికారులు తమ గ్రామ పంచాయతీ సెక్రెటరీ మాదిరిగా విధుల పట్ల అంకితభావంతో పని చేస్తే తప్పకుండా గ్రామస్వరాజ్యం వస్తుందని, గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలుగా మారుతాయని, అభివృద్ధికి ఆనవాళ్లుగా గ్రామాలు అతి త్వరలో రూపాంతరం చెందుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.