• ఇదిగో ఆర్డర్‌ కాపీ..అదిగో ఉద్యోగం
  • సూపరింటెండెట్‌ సంతకంతో ఆర్డర్‌ కాపీ!
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంతం
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ జాయినింగ్ లెటర్!
  • దళారుల చేతిలో మోసపోవద్దు: ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెట్‌

వేద న్యూస్, వరంగల్ :
ఉద్యోగాలు వస్తాయనే ఆశతో పెద్ద పెద్ద చదువులు చదివారు..ఒక్కో ఇంట్లో పెద్ద చదువులు చదివిన వారు ఇద్దరు, ముగ్గురు కూడా ఉన్నారు. ఉద్యోగాల కోసం ఏండ్లుగా ఎదరుచూస్తున్న వారూ ఉన్నారు. 10, ఇంటర్‌ అర్హత కలిగిన ఉద్యోగాలకు సైతం బీటెక్, ఎంటెక్‌ చదివిన వారు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి వేలాది మంది యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. చిన్న ప్రైవేట్‌ ఉద్యోగమైనా దొరికితే చాలనుకునే ఇలాంటి నిరుద్యోగుల ఆశలను, అవకాశాలను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసుకొని ఉడాయిస్తున్నారు. నిరుద్యోగులు మోసపోయిన ఘటనలు ఇటీవల రాష్ర్టంలో అనేకం చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించిన యువకులు వారు మోసపోయామని గ్రహించడానికి నెలలు, ఏళ్లు పడుతోంది. ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ.. నకిలీ నియామక ఉత్తర్వులు జారీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 23వ తేదీతో జారీ చేసిన ఒక నకిలీ ఉత్తర్వు తాజాగా సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది.

ఓ మహిళా నిరుద్యోగిని ఐసీయూ టెక్నీషియన్ గా నియమిస్తూ, ఫిబ్రవరి 26న విధుల్లో చేరాలని ఎంజీఎం హెల్త్ డిపార్ మెంట్ హాస్పిటల్ పేరున ఉత్తర్వులు ఇచ్చారు. దానిపై గ్రీన్ పెన్నుతో సూపరింటెండెట్‌ డాక్టర్ యాదవ్ కుమార్ అని సంతకం కూడా ఉంది. అయితే, ఇక్కడ విచిత్రం ఏంటీ అంటే ఎంజీఎం సూపరింటెండెట్‌ పేరు చంద్ర శేఖర్..అలాగే ఫిబ్రవరి 9వ తేదీతో మరో నియామక ఉత్తర్వు వెలుగుచూసింది.

ఆఫీస్ ఆఫ్ ది రీజినల్ మెడికల్ ఆఫీసర్ ఎంజీఎం హాస్పిటల్, వరంగల్ అని దానిపై ఉంది. అయితే, ఎంజీఎంలో రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. కానీ, రీజినల్ మెడికల్ ఆఫీసర్ పోస్టు అనేది లేదు. దీన్నిబట్టి ఎవరో నకిలీ నియామక పత్రాలతో నిరుద్యోగులకు వల విసురుతున్నట్లు స్పష్టమవుతోంది. కాంట్రాక్టు పద్ధతిలో నెలకు రూ.25 వేల వేతనం అని పేర్కొంటూ ఓ మహిళకు ఓపీ రిసెప్షనిస్టుగా నియమిస్తూ.. ఈ నెల 19న విధుల్లో చేరాలా ఎంజీఎం సూపరింటెండెట్‌ డాక్టర్ జె. సుధాకర్ రెడ్డి పేరుతో మరొక పత్రం వెలువడింది. ఇలా నకిలీ నియామక పత్రాలు తెరమీదకు రావడంతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే ఇలాంటి మోసగాళ్లను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

 

ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టరిత్యా చర్యలు : ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెట్‌ చంద్రశేఖర్

సామాజిక మాధ్యమాలలో రీజినల్ మెడికల్ ఆఫీసర్ అలాగే సూపరింటెండెట్‌ ఎంజీఎం హాస్పిటల్ పేరుతో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామక పత్రాలు ఇచ్చినట్లుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఎంజీఎం ఆసుపత్రిలో డాక్టర్ జె.సుధాకర్ రెడ్డి పేరుతో సూపరింటెండెట్‌ గా, ఆర్ఎంఓ గాని పనిచేయట్లేదు.. అలాగే డాక్టర్ యాదవ్ కుమార్ అలాగే రాజేందర్ రెడ్డి అనే పేర్లు గల ప్రొఫెసర్ ఎవరూ పనిచేయడం లేదు. దయచేసి ప్రజలు ఎవరూ మోసపోవద్దని మనవి. ఎవరైనా దళారులు ఇటువంటి చర్యలకు పాల్పడిన యెడల చట్టరిత్యా చర్యలు తీసుకోబడుతాయి.