• కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు రామారావు
  • బీజేపీ ఎంపీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీఎస్‌లో ఫిర్యాదు

వేద న్యూస్, ఇల్లందకుంట:
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన ‘ప్రజాహిత’ యాత్రలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు ఇంగిలే రామారావు తెలిపారు.

బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కంప్లయింట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇల్లందకుంట మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూపార్లమెంట్ లో బీసీల గురించి ఏనాడూ బండి మాట్లాడలేదని విమర్శించారు.

ఎంపీ బండికి మతి భ్రమించిందని, ఆయన్ను పిచ్చాస్పత్రిలో చేర్పించాలని అన్నారు. రెచ్చగొట్టే మాటలు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోని..రాజకీయ అవగాహన లేని ఎంపీ సంజయ్ అని ఆరోపించారు. అసెంబ్లీలో బీసీ కుల గణన తీర్మానాన్ని ప్రవేశపెట్టేలా కృషి చేసిన బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు తీసే అర్హత లేని బీసీ వ్యతిరేకి సంజయ్ అని విమర్శించారు.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రతీ మహిళ, తల్లిని గౌరవించే ప్రతి ఒక్కరూ సంజయ్ ను ఓడిస్తారని జోస్యం చెప్పారు. బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఇల్లందకుంట మండలంలోని 18 గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.