వేద న్యూస్, డెస్క్ :

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి అందరికీ విదితమే. ఆయన బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు చేతిలో ఘోర పరాభవం చవిచూసిన ఆయన  కమలం గూటికి చేరారు.

బీఆర్ఎస్ లో తనకు పార్లమెంట్ టికెట్ ఇవ్వరనే ఉద్దేశంతోనే బీజేపీ లో  చేరారనే ఆరోపణలు లేకపోలేదు. అరూరి రమేశ్ ఓ వైపు బీఆర్ఎస్ నుంచి టికెట్ కు ప్రయత్నాలు చేస్తూనే..మరో వైపు బీజేపీ నేతలతో టచ్ లో ఉంటూ కొద్ది రోజులు హైడ్రామా క్రియేట్ చేసి బీజేపిలోకి వచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే, ఇప్పటికే బీజేపీ ఎంపీ టికెట్ కు ఆశావహులు ఎక్కువ కావడం, పక్క పార్టీ నుంచి వచ్చి మరీ టికెట్ దక్కించుకునేందుకు పోటీ పెరుగుతుండటంతో టికెట్ ఎవరికి దక్కుతుందోననే టెన్షన్ వరంగల్ జిల్లావ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో మొదలైంది.

కాగా, ‘అరూరి రమేష్ ఎంపీగా గెలిస్తే బీజేపీలో ఉంటారు..ఓడితే బీజేపీ కోసం పని చేయబోరని, అవసరాల కోసం మళ్లీ వేరే పార్టీ వెతుక్కుంటారని’ కింది స్థాయి కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మొదటి నుంచి బీజేపీ జెండా మోస్తూ కష్టపడ్డ వారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని, కచ్చితంగా మోడీ హవాతోనే ఎంపీ స్థానాలు తెలంగాణలో గెలుచుకోవచ్చని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి..వరంగల్ పార్లమెంట్ స్థానానికి  బీజేపీ అధిష్టానం అరూరి రమేష్ కు  టికెట్ ఇస్తుందో లేదో.. ఒకవేళ ఇచ్చినా వరంగల్ బీజేపీ కార్యకర్తలు, నాయకులు..బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పని చేస్తారో లేదో..?