- ఉద్యోగ విరమణ సభలో వక్తలు
- ఘనంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమం
వేద న్యూస్, జమ్మికుంట:
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొత్కపల్లి టీచర్ చదువు సులోచనాదేవి ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభ ఆదివారం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. జెడ్పీహెచ్ఎస్ పొత్కపల్లి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ, హెచ్ఎంలు, స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు విద్యార్థులు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 37 ఏండ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన గొప్ప టీచర్ సులోచనాదేవి అని కొనియాడారు. వారి శేష జీవితం హాయిగా గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సులోచనాదేవి దంపతులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి పలువురు ఘనసన్మానాలు చేశారు.
1987 నుంచి 2024 వరకు సుదీర్ఘ కాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన సులోచనాదేవి ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని వెల్లడించారు. కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, సింగిల్ విండో చైర్మన్ సంపత్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.