వేద న్యూస్, పరకాల:

ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండలోని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన పరకాల నియోజకవర్గం నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి వరంగల్ ఎంపీ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తోందని తెలిపారు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమలను గాలికి వదిలి కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని అలాంటి మతత్వ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర కార్యకర్తలకు మరింత బలాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, రేపు కేంద్రంలో కూడా అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మనమందరం కలిసికట్టుగా పనిచేద్దామని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నడికుడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.