- మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు
- ఎమ్మెల్యే కౌశిక్ ప్రేరేపణతోనే పార్టీకి వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు
- టీపీసీసీ సభ్యుడు పత్తి కిష్ణారెడ్డి విమర్శ
వేద న్యూస్, జమ్మికుంట:
కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ పై కొందరు నాయకులు చేసిన ఆరోపణలు నిరాధారామైనవని సీనియర్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్‌లో నాయకుడు సుంకరి రమేశ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు పత్తి కిష్ణారెడ్డి, పొనగంటి మల్లయ్య, దేశిని కోటి, మహిళా కాంగ్రెస్ నేత పూదరి రేణుక శివకుమార్ గౌడ్ హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులపై అధిష్ఠానం చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేశారు. దురుద్దేశంతో ఇన్ చార్జి ప్రణవ్, ఆయన కుటుంబ సభ్యులపై దుర్భాషలాడారని తెలిపారు.
కార్యకర్తలు అధైర్య పడొద్దు: పూదరి రేణుక శివకుమార్ గౌడ్
మహిళా కాంగ్రెస్ నాయకురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులు కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రణవ్‌ను అడగడానికి వారి స్థాయి ఎంత? అని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారు ‘తస్మాత్ జాగ్రత్త’ అని హెచ్చరించారు. వొడితల ప్రణవ్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకెళ్తున్నారని తెలిపారు. గతంలో 3 వేల ఓట్లు రాగా, మొన్నటి సాధారణ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తల సమిష్ఠి కృషితో 54 వేల ఓట్లు వచ్చాయని వివరించారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో కొందరు లీడర్లు మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో తమకు ప్రణవ్ మర్యాద ఇవ్వలేదని తెలపడం సరికాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. ఇప్పటికైతే ఆరుగురే సస్పెండ్ అయ్యారని, ఇంటి దొంగలు ఎవరైనా పార్టీలో ఉంటే సర్దుకోవాలని హితవు పలికారు. కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి, ప్రణవ్, పొన్నం ప్రభాకర్, సత్యనారాయణల నాయకత్వంలో పార్టీ నియోజకవర్గంలో బలంగా ముందుకు సాగుతుందని చెప్పారు.
అందరినీ గౌరవించే నాయకుడు ప్రణవ్: పొనగంటి మల్లయ్య
సీనియర్ నాయకుడు పొనగంటి మల్లయ్య మాట్లాడుతూ ఇన్ చార్జి ప్రణవ్ పై కొందరు చేసిన ఆరోపణలను ఖండించారు. ప్రణవ్ సౌమ్యశీలి అని, అందరితో కలుపుగోలుగా మాట్లాడే నాయకుడని, అందరినీ గౌరవించే యువనేతని చెప్పారు. ఆయన ఎన్నడూ స్వరం పెంచి మాట్లాడలేదని తెలిపారు. కొందరు నేతలు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను కలిసి ఆయన్నూ బదనాం చేస్తున్నారని తెలిపారు. విలువలు లేకుండా ఓ సీనియర్ నాయకుడు పార్టీలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరి శక్తి ఏంటో వారే గమనించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పార్టీ బలోపేతానికి సమిష్ఠిగా పని చేయాలన్నారు.
అందరి సమిష్ఠి కృషితో పార్టీ బలోపేతం: సీనియర్ నాయకుడు కోటి
సీనియర్ నాయకుడు దేశిని కోటి మాట్లాడుతూ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రణవ్ కుటుంబ సభ్యులను కించపరిచేలా కొందరు మాట్లాడటం సరికాదన్నారు. అసభ్యకర పదజాలంలో ప్రణవ్ ను దూషించడం ఎంత మాత్రం సరికాదని చెప్పారు. పార్టీ లో తాను ఎన్ఎస్‌యూఐ ప్రెసిడెంట్ గా పని చేశానని, ఆ తర్వాత జెడ్పీటీసీగా పోటి చేసి ఓడిపోయానని, ఇల్లందకుంట దేవస్థాన చైర్మన్ గా పని చేశానని తెలిపారు. నాడు దామోదర్ రెడ్డిని ఎదిరించి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో పని చేసిన సందర్భాన్ని కోటి గుర్తుచేశారు. వార్డు అభివృద్ధి కోసం ఇతర పార్టీలోకి వెళ్లి..తిరిగి సొంతగూటికి చేరుకున్నట్టు వివరించారు. కొత్తపల్లిలో కొందరు నాయకులు ప్రెస్ మీట్ పెట్టి నాయకుడు ప్రణవ్ ను దూషించడాన్ని ఖండించారు. పార్టీలో అసమ్మతి ఉంటే ఇంటర్నల్ గా ఫిర్యాదు చేయాలని తెలిపారు.
క్రమశిక్షణా కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి ఆదేశాల మేరకే సస్పెన్షన్: టీపీసీసీ సభ్యుడు పత్తి కిష్ణారెడ్డి
మీడియా సమావేశంలో టీపీసీసీ సభ్యుడు పత్తి కిష్ణారెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో రాజకీయం అంటే అమ్మకాలు, కొనుగోలు అనే రీతిలో కొందరు తయారు చేశారని చెప్పారు. తమ గ్రామ, వార్డు అభివృద్ధి కోసం కొందరు లీడర్లు పార్టీ మారి మళ్లీ తిరిగి పార్టీలోకి వచ్చినట్టు తెలిపారు. ఇటివల కాలంలో ప్రజా ఆదరణ కలిగిన నేతలను కొందరని పార్టీలోకి చేర్చుకున్నట్టు చెప్పారు. అయితే, అందులో కొందరు తామే పార్టీని నడుపుతున్నట్టు మాట్లాడుతున్నారని చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రోద్బలంతో కొందరు కరపత్రాలు, లేఖలు విడుదల చేసి, సమావేశాలు పెట్టి పార్టీ వ్యతరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పథకం ప్రకారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కొందరిని కాంగ్రెస్ ముసుగులో వ్యతిరేక వ్యాఖ్యలు చేయిస్తున్నారని విమర్శించారు. అలా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నూ బదనాం చేస్తున్నారని వివరించారు.ఇంకా ‘స్థానిక’ ఎన్నికలు, నామినేటెడ్ పదవులు పూర్తి కాలేదని, అప్పుడే కొందరు తమకు నష్టం జరిగింది? అని ఎలా చెప్తారని ప్రశ్నించారు. తమకు జరిగిన నష్టం ఏంటో తెలపాలన్నారు. పక్క పార్టీల నుంచి వచ్చే బహుమతుల కోసం కొందరు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెర తీశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రేరేపణతో కోవర్టులుగా మారి కొందరు లీడర్లు పార్టీకి, ఇన్ చార్జి ప్రణవ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు.
పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి ఆదేశాల మేరకే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరుగురు లీడర్ల సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారని వెల్లడించారు. సమస్యలుంటే నాయకత్వం దగ్గర చర్చించాలని సూచించారు. బహిష్కరణకు గురైన నాయకులతో ఎలాంటి సంప్రదింపులు ఉండబోవని స్పష్టం చేశారు. కమిటీల విషయమై మాట్లాడుతూ ఒకే మండలం, గ్రామం, పట్టణం ఇలా అన్ని కమిటీలకు ఇద్దరేసి అధ్యక్షులు ఎందుకు? అనే విషయమై ఇన్ చార్జి ప్రణవ్ డీసీసీ అధ్యక్షుడు, టీపీసీసీతో చర్చించి కమిటీలను రద్దు చేసినట్టు కిష్ణారెడ్డి వివరించారు. త్వరలో కమిటీలు ఉంటాయని పేర్కొన్నారు. హస్తం పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ‘జై కాంగ్రెస్, జై ప్రణవ్’ అంటూ నినాదాలు చేశాయి. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.