వేద న్యూస్, మహబూబాబాద్ : 

అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భీనీలకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్‌ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా సంక్షేమ అధికారి, సి. డి.పి.ఓ లు, సూపర్వైజర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పోషకాహారం అందజేయాలని అన్నారు. బాలింతలు, గర్భిణులు, పిల్లల హాజరును క్రమం తప్పకుండా నమోదు చేయాలన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా పోషకాహారం పంపిణీ చేయాలని చెప్పారు. పిల్లల ఎదుగుదల ఎత్తు బరువులను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. శారీరక, మానసిక ఎదుగుదలలో లోపాలు ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్రీ స్కూల్స్‌ యాక్టివిటీస్‌లో పిల్లలు ఆట పాటలతో కూడిన విద్యను నేర్చుకునేలా ప్రోత్సహించాలన్నారు. అంగన్‌వాడీకేంద్రాల్లో పంపిణీ చేసే కోడిగుడ్లు నాణ్యత ప్రమాణాలను పరిశీలించుకోవాలని తెలిపారు. పాలు, పప్పు, కూరగాయలతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రతి రోజు మధ్యాహ్నం అందించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో గర్భిణుల వివరాలు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని టీచర్లకు సూచించారు. ప్రసవం తర్వాత బాలింతలు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాలను తెలియజేయాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశం లో జిల్లా సంక్షేమ అధికారిణి వరలక్ష్మి, సి.డి.పి.ఓ.లు, అంగన్ వాడీ సూపర్వైజర్స్, పాల్గొన్నారు.