- శాంతి భద్రతల పరిరక్షణలో గోదారి మార్క్
- సక్కని మనసున్న పోలీస్ ఆఫీసర్‌గా ప్రజల్లో గుర్తింపు
- యువతను చిత్తు చేస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ఎస్ఐ
- మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలపై నాటకాల రూపంలో అవగాహన
- సేవా కార్యక్రమాలతో ప్రజల మదిలో స్థానం సంపాదించుకున్న ఖాకీ
వేద న్యూస్, వరంగల్:
సింగరేణి ప్రాంతం నుంచి వచ్చిన వారు ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తారనే నానుడిని అక్షరాలా నిజం చేస్తున్నారు ఎల్కతుర్తి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గోదారి రాజ్ కుమార్. ఆయన పేరు చెబితే చాలు.. శాంతి భద్రతల పరిరక్షణలో తన వంతు కృషి చేస్తున్న నిబద్ధత కలిగిన పోలీస్ ఆఫీసర్ అని జనం పేర్కొంటుండటం విశేషం. వృత్తి రీత్యా సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయిన ఆయన స్నేహ హస్తం చాచి పలు సేవా కార్యక్రమాలతో రా ‘రాజు’గా నిలుస్తున్నారు. ఖాకీగా తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తుండటంతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
గని కార్మికుడి కుటుంబంలో ఖాకీ బ్రదర్స్
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన సింగరేణి బొగ్గు గని కార్మికుడు గోదారి అమృత-లచ్చులు దంపతుల తొలి సంతానం గోదారి రాజ్ కుమార్.. చిన్న నాటి నుంచి తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన..రాజ్ కుమార్.. కష్టపడి చదివి తల్లిదండ్రులు గర్వపడేలా ప్రయోజకుడయ్యారు. రాజ్ కుమార్‌ను చూసి తన సోదరుడు రవి కూడా ఖాకీ వృత్తిలోకి రావడం విశేషం. సోదరలిరువురూ కష్టపడి చదివి తల్లిదండ్రుల పేరు నిలబెట్టారు.
రాజ్ కుమార్ చిన్న నాటి నుంచి సామాజిక స్పృహను కలిగి ఉన్నారు. తనను పెంచి పెద్దవాడిని చేసిన సంఘానికి తిరిగి సేవ చేయాలనే సంకల్పంతో(పే బ్యాక్ టు సొసైటీ) సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పేదరికాన్ని విద్యతోనే జయించవచ్చని యువతకు దిశా నిర్దేశం చేస్తూ..తనకు తోచినంతలో పలువురికి సాయం చేస్తున్నారు. తన జీతంలో కొంత వృద్ధులు, కడుపేదరికంలో ఉన్న విద్యార్థులకు చదువుల నిమిత్తం అందిస్తూ ఈ పోలీస్ అధికారి వారికి చేయూతను అందిస్తున్నారు.
తన ఊరు మిట్టపల్లిలో 5వ తరగతి వరకు చదువుకున్న రాజ్ కుమార్.. ప్రాథమికోన్నత విద్య కోసం ప్రతిరోజూ జైపూర్ మండలకేంద్రానికి సుమారు 8 కి.మీ. కాలినడకన పుస్తకాల సంచులు మోసుకుంటూ వెళ్లారు. కనీసం సైకిల్ కూడా కొనుక్కునే ఆర్థిక స్థోమత లేని కుటుంబంలో నుంచి వచ్చిన రాజ్ కుమార్..కసితో చదివి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చారు. బహుశా..అందుకేనేమో రాజ్ కుమార్.. విద్యార్థులకు చదువు ప్రాముఖ్యతను దాదాపుగా ప్రతి సందర్భంలో వివరిస్తుంటారు.
పోలీస్ ఆఫీసర్లకు కేరాఫ్ గోదారి వారి ఫ్యామిలీ
సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోదారి రాజ్ కుమార్ కుటుంబం..పోలీస్ అధికారులకు కేరాఫ్ అన్నట్టుగా ఉండటం విశేషం.! రాజ్ కుమార్ సోదరుడు రవికుమార్ సైతం పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజ్ కుమార్ తొలి పోస్టింగ్ మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు కాగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
యువతను సన్మార్గంలో నడిపించేందుకు ప్రయత్నాలు
యువత జీవితాన్ని చిత్తు చేస్తున్న మత్తుపదార్థాలను నిర్మూలించేందుకు ఎస్ఐ రాజ్ కుమార్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. యువత పెడదోవ పట్టకుండా ఉండేందుకు వారిలో చైతన్యాన్ని నింపేందుకు పోలీస్ అధికారిగా రాజ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు.
డ్రగ్స్, మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై గ్రామాలలో నాటకాల రూపంలో అవగాహన సభలు నిర్వహిస్తున్నారు. యువత ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ లక్ష్య సాధనకు కార్యోన్ముముఖులు కావాలని ప్రముఖ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం ఇచ్చిన సందేశాన్ని యువతీ యువకులు అవగతం చేసుకోవాలని సూచిస్తూ..పోలీస్ ఆఫీసర్ రాజ్ కుమార్ యువతను గైడ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మండల పరిధిలో వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. మండల పరిధిలోని డ్రగ్స్, మత్తు పదార్థాలను సేవించే యువకులను పట్టుకున్నారు. డ్రగ్స్, గంజాయి సప్లయ్ చెయిన్ బ్రేక్ చేసి..గంజాయి ముఠాపై ఉక్కుపాదం మోపుతున్నారు.
మండల పరిధిలోని విద్యాసంస్థల యాజమాన్యాలతో పాటు అన్ని వర్గాల ప్రజలతో విస్తృతంగా సత్సంబంధాలు కలిగిన రాజ్ కుమార్..శాంతి భద్రతల పరిరక్షణలో తన మార్క్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ కుమార్ సేవలను గుర్తించి సీపీ, పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. యువత ఉన్నత విధ్యనభ్యసించి సన్మార్గంలో జీవితంలో ముందుకెళ్లాలనే సందేశాన్ని అందిస్తూ..వారు డ్రగ్స్, మత్తు పదార్థాల వంటి దురలవాట్లు చేసుకోని పెడదోవ పట్టకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్ఐ వెల్లడించారు.
ప్రజల మన్ననలు పొందిన ఖాకీ
సాధారణంగా ఖాకీ దుస్తుల చాటున కాఠిన్యం, కరుకుదనం మాత్రమే ఉంటాయని అభిప్రాయం కొందరిలో ఉంటుంది. కానీ, అది నిజం కాదని నిరూపిస్తున్నారు గోదారి రాజ్ కుమార్. ఖాకీ అంటే కరుణతో పాటు సేవా దృక్పథం కూడా ఉంటుందని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు.
పోలీస్ అధికారిగా విధి నిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు ఆలనా పాలనాకు నోచుకోని వృద్ధులకు సేవ చేయడంలో ఎస్ఐ రాజ్ కుమార్ ముందుంటున్నారు. బడి బాట కార్యక్రమంతో పాటు విద్యార్థులకు మోటివేషనల్ క్లాసెస్ ఇచ్చేందుకు రాజ్ కుమార్ తన వంతుగా చొరవ తీసుకుంటున్నారు.