•  ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ హోర్డింగ్స్‌తో పొంచిన ప్రమాదం
  •  హన్మకొండ వ్యాప్తంగా రోడ్లపైన ప్రజలు ఇబ్బంది పడేలా ఉన్న వైనం 
  • ఇరుకుగా ఉన్న రోడ్లపైన ఇష్టమొచ్చినట్టు ఏర్పాటు..రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం

వేద న్యూస్, వరంగల్:

వరంగల్ నగర ప్రజల క్షేమంపై దృష్టి సారించాల్సిన ప్రథమ పౌరురాలు అసలు ఆ సంగతి పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆమెనే స్వయంగా జనం ఇబ్బంది పడేలా పరోక్షంగా సహకరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ లలితా జ్యువెల్లరీ నూతన షో రూంను హనుమకొండలోని రాయపురలో ప్రారంభించారు. ఈ మార్ట్ ఓపెనింగ్‌కు ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్‌తో పాటు ప్రజాప్రతినిధులు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి,వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు.

అయితే, ప్రారంభోత్సవం జరిగి మూడు నాలుగు రోజులు గడిచినా సదరు జ్యువెల్లరీ మార్ట్‌కు సంబంధించిన హోర్డింగ్స్ హనుమకొండ వ్యాప్తంగా దర్శనమిస్తుండటం గమనార్హం.  ప్రైమ్ సిటీగా రూపాంతరం చెంది ఇప్పటికే ట్రాఫిక్ అవస్థలతో ఇబ్బందులు పడుతున్న వరంగల్ నగరవాసులకు ఈ హోర్డింగ్స్ ఇబ్బందికరంగా మారాయి. అలా రోడ్డు నడీమధ్యలో, డివైడర్లను ఆనుకుని, రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ పడితే అక్కడ అన్నట్టుగా వెలసి ఉండటం చూసి నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు అయితే సదరు హోర్డింగ్స్‌తో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

తమ సొంత జాగా అన్నట్టుగా సదరు జ్యువెల్లరీ సంస్థ హోర్డింగ్స్ ఇష్టమొచ్చినట్టుగా ఏర్పాటు చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లను ఇలా హోర్డింగ్స్ ఆక్రమించేస్తే.. ఇక వాహనదారులు, నగరవాసుల పరిస్థితి రోడ్లపై భద్రంగా ఎలా ఉంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి వల్ల ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాలకు బాధ్యులు ఎవరు? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సదరు జ్యువెల్లరీ సంస్థకు నగర మేయర్ సహకారం ఉండటం వల్లే హోర్డింగ్స్ ఇలా విచ్చలవిడిగా ప్రదర్శిస్తున్నారా? ఓ వ్యాపారికి మేలు చేసే క్రమంలో గ్రేటర్ వరంగల్ నగరవాసుల క్షేమంపై పట్టింపు ఉండనక్కర్లేదా? అని ప్రశ్నిస్తున్నారు. గాలిదుమారం లేదా చిన్న పాటి చిరుజల్లులకు ఆ హోర్డింగ్స్ రోడ్డుపైనే పడిపోతే అటువైపుగా వచ్చే వాహనాలకు ప్రమాదాలు జరుగుతాయని, ప్రయాణికులు, వాహనదారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నదని, ఈ విషయాన్ని ఆఫీసర్లు, నగర మేయర్ గుర్తించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.  నగర ప్రథమ పౌరురాలు తన నగరవాసుల క్షేమమే ధ్యేయంగా రోడ్లపైన ఇలా హోర్డింగ్స్ విచ్చలవిడిగా ప్రదర్శించేవారిని ప్రోత్సహించకూడదని జనం కోరుతున్నారు.

ప్రజాక్షేమమే ధ్యేయంగా పని చేయాల్సిన మేయర్.. వ్యాపారి పక్షానో లేదా ఇంకెవరి పక్షానో ఉండాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఏదైనా ఓపెనింగ్‌కు వెళ్లే ముందర ప్రథమ పౌరురాలితో పాటు ప్రజాప్రతినిధులు నగరవాసులకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై విచ్చలవిడిగా, ఇష్టమొచ్చినట్టు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా హోర్డింగ్స్ పెట్టకూడదని సూచించాలని, అలా చేస్తేనే ప్రారంభోత్సవాలకు వస్తామని కండిషన్  పెట్టాలని నగరవాసులు సూచిస్తున్నారు.