•  ఈవో సంగతేంటని ప్రశ్నిస్తున్న ప్రజలు

వేద న్యూస్, వరంగల్:

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరు గాంచిన కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో నిబంధనలు ఉల్లంఘించి సోమవారం గర్భగుడి తలుపులు మూసి షూటింగ్ నిర్వహించారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డ సంగతిని ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ఈ నెల 21 ప్రధాన సంచికలో ‘పైసలిస్తే గర్భాలయం మూసి షూటింగ్!’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ స్టోరీకి టెంపుల్ కార్యనిర్వాహణాధికారి స్పందించారు. ఆలయంలో ప్రైవేటు సాంగ్ షూటింగ్ విషయమై పత్రికా ప్రకటన మంగళవారం విడుదల చేశారు.

తాను ఈ నెల 20న కుంభాభిషేకం నిర్వహణలో భాగంగా శృంగేరి పీఠాధిపతులు వారిని ఆహ్వానించుటకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం రీజినల్ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో దేవస్థానం అర్చక స్వాములతో కలిసి బళ్లారికి వెళ్లినట్టు కార్యనిర్వాహణాధికారి పేర్కొన్నారు.  ఆ సమయంలో గాయని మధుప్రియకు సంబంధించిన వారు దేవాలయం బయట ఆవరణలో, గోదావరి నది వద్ద శివరాత్రికి సంబంధించిన భక్తి పాట చిత్రీకరించుటకు అనుమతి ఇవ్వవలసినదిగా సెల్ ఫోన్ ద్వారా కోరారని తెలిపారు. 

అయితే, టెంపుల్ బయట కానీ గోదావరి నది వద్ద కానీ పాట చిత్రీకరించుటకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ గర్భాలయంలో దేవతా మూర్తుల వద్ద  పాట చిత్రీకరించుటకు వీలులేదని స్పష్టం చేశామని వెల్లడించారు. కాగా, దేవస్థానం కార్యాలయము నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా గాయని  మధుప్రియ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి గర్భాలయం లోపల భక్తి పాట చిత్రీకరించిన విషయం తనకు.. వార్తాపత్రికల్లో, టీవీ చానళ్లలో వచ్చే వరకు కూడా తెలియదని వివరించారు. 

ఆ సమయంలో దేవాలయంలో లోపల డ్యూటీలో ఉన్న అర్చక స్వామి తనకు ఈ విషయం తెలపలేదని,  పాట చిత్రీకరించుటకు ముందు దేవస్థానం అధికారుల అనుమతి పొందినారా? లేదా అనే విషయాన్ని కూడా నిర్ధారించుకోలేదని వెల్లడించారు. దేవస్థాన పర్మిషన్ లేకుండా గాయని మధుప్రియకు పాటచిత్రీకరణకు అవకాశం ఇచ్చిన అర్చకుడు ఏ. రామకృష్ణకు నోటీసు జారీ చేసినట్టు కార్యనిర్వాహణాధికారి స్పష్టం చేశారు.

తూతూ మంత్రంగా అర్చకుడిపైన చర్యలు..?

దేవాలయం తలుపులు మూసి భక్తులకు అసౌకర్యం కలిగిన విషయమై సదరు అర్చకుడు, డ్యూటీ సిబ్బందిని విచారించగా, దేవాలయంలో పాట చిత్రీకరించిన సమయంలో దేవాలయం తలుపులు వేయడం కానీ, భక్తులను ఇబ్బంది పెట్టి అసౌకర్యానికి గురి చేయడం కానీ జరగలేదని వారు తెలిపారని కార్యనిర్వాహణాధికారి పేర్కొన్నారు.  కాగా, అర్చకుడికి తూతూ మంత్రంగా నోటీసులు అందించడం.. ఈవోను తప్పించేందుకేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరీ ఈవో సంగతేంటని జనం అడుగుతున్నారు. ఆలయ సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ వ్యవహరిస్తున్న అందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అలా అయితేనే మరోసారి అధికారులు ఇష్టమొచ్చినట్టు వ్యవహరించబోరని అభిప్రాయపడుతున్నారు. మౌఖిక అనుమతులు సైతం అధికారులు ఇవ్వడం విషయమై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.