• హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అడవుల జీవవైవిధ్య విధ్వంసం పైన OWLS ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

వేద న్యూస్, వరంగల్:

తెలంగాణ ప్రభుత్వం గత వారం రోజుల నుంచి రాష్ట్రంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) లో హైదరాబాద్ కు ఊపిరి అందిస్తున్న అడవిని, అడవి జంతువులను, వృక్షాలను, నీటి కుంటలను చట్టవిరుద్ధంగా 400 ఎకరాలను రాత్రికి రాత్రి నాశనం చేయడం దారుణం అని పలువురు పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి సంబందించిన 400 ఎకరాల అడవి విధ్వంసం గురించి ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ(OWLS) ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ చర్చా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్  హాజరై మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ప్రమాణాలు గల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జీవులను ఛిద్రం చేస్తూ, చెట్లను, జీవుల ఆవాసాలను, నీటి వనరులను, పర్యావరణ చట్టాలను, అటవీ చట్టాలను, నీటి చట్టాలను తుంగలో తొక్కి కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తూ అక్కడి జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సామాజిక బాధ్యతతో జీవ వైవిధ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులపైన, ఇతరులపైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. తాను పర్యావరణ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నానని తెలిపారు.

మాజీ మేయర్ టి. రాజేశ్వరరావు మాట్లాడుతూ… మనిషి తన అస్తిత్వం కోసం ప్రకృతిని నాశనం చేయడం దారుణం అన్నారు. 400 ఎకరాలల్లో అడగని విధ్వంసం చేయడం ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయమేనని పేర్కొన్నారు.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పౌర సమాజం పోరాడాలని పిలుపునిచ్చారు.

 

“ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ” సంస్థ సభ్యులు మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై రాష్ట్రప్రభుత్వం ఎన్నో సంవత్సరాల వయసు కలిగిన చెట్లను పీకివేస్తూ జింకలను, నెమళ్లను,వివిధ రకాల పక్షులను, షెడ్యూల్ 1,2,3,4, జాబితాలో గలిగిన జీవులను,నక్షత్ర తాబేళ్లను, ఉడుములను, పాములను, తొండలను జీవ వైవిధ్యం పరంగా ప్రాధాన్యత కలిగిన వివిధ రకాల జీవులను, నాశనం చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా HCU జీవవైవిధ్యం,  ప్రభుత్వం చేపట్టిన విధ్వంసంపై 10 నిమిషాల వీడియో అదేవిధంగా 30 నిమిషాల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఔల్స్ జాయింట్ సెక్రెటరీ రవిబాబు పిట్టల ప్రజెంట్ చేశారు.

వివిధ NGO’S ప్రతినిధులు మాట్లాడుతూ నీరు, భూమి, ఖనిజాలు, చెట్లు వంటివి పరిమిత వనరులు కాబట్టి  వాటిని బాధ్యతాయుతంగా ఉపయోగించాలన్నారు . సహజ వనరుల సంపద నశిస్తే రాబోయే తరాలకు మనుగడ సాగించడం ఒక సవాల్ గా మారుతుందని వెల్లడించారు.

భూమి ఆరోగ్యంగా ఉండాలంటే, అడవులను సంరక్షించుకోవాలని, ఊపిరితిత్తులు దెబ్బతింటే శరీరానికి ఎలా నష్టం కలుగుతుందో, అదే విధంగా అడవులు నాశనం అయితే వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, నీటి కొరత వంటి సమస్యలు ఏర్పడతాయని చెప్పారు. ఈ సందర్భం గాహైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల అక్రమ అరెస్టులను ముక్త ఖంఠంతో ఖండిస్తూ వారిని బేషరుతుగా విడుదల చేస్తూ వారిపైన పెట్టిన కేసులను వెంటలే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

 కార్యక్రమంలో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంస్థ అధ్యక్షులు ఇందారం నాగేశ్వరరావు , సెక్రెటరీ చెల్పూరి శ్యాం సుందర్, జాయింట్ సెక్రెటరీ పిట్టల రవి బాబు, “టార్చ్” వ్యవస్థాపక అధ్యక్షులు అరవింద్ ఆర్య, వన సేవ ప్రతినిధులు పొట్లపల్లి వీరభద్రా రావు, నరేష్, పర్యావరణవేత్త రతన్ సింగ్, డాక్టర్ ప్రసాద్ ,నిమ్మ శ్రీనివాస్, నిఖిత, జేవీవీ సంస్థ ప్రతినిధి పరికిపండ్ల వేణు, కమలాకర్ స్వామి, కుమారి రాపోల్ నిఖిత, విద్యార్థి నాయకులు శరత్, రాకేష్ యాదవ్, బైరపాక ప్రశాంత్, శ్రీకాంత్ చారి, వీరస్వామి, అనిల్ తదితరులు వివిధ ఎన్జీవో సంస్థల ప్రతినిధులు పాల్గొని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేశారు.