వేద న్యూస్, హైదరాబాద్:
బీసీలపై బీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో అంబేడ్కర్ సెక్రెటేరియట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘సవతి తల్లి మీది.. తెలంగాణ తల్లి మాది’ అని చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా ఉన్న పార్టీ పేరును బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి)గా కేసీఆర్ మార్చిన సంగతి కవితకు గుర్తు చేస్తున్నట్టు వెల్లడించారు. దేశరాజధాని ఢిల్లీలో లిక్కర్ స్కామ్‌లో దొరికిపోయి తిహాడ్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ.. ఇప్పుడు బీసీలపై ప్రేమ కనబరుస్తూ.. పూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ కొత్త నాటకం తెరమీదకు తెస్తోందని విమర్శించారు.
బీసీల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు పాటు పడుతోందని వివరించారు. ‘రాజీవ్ యువ వికాసం’ స్కీమ్ ద్వారా నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఆన్ లైన్ ద్వారా 16 లక్షల మంది సదరు స్కీమ్ కు అప్లయ్ చేసుకున్నారని వెల్లడించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కోసం రాష్ట్ర సర్కారు బిల్లు పెట్టిందని చెప్పారు. వచ్చే పదేండ్లు తెలంగాణలో అధికారంలో ఉండబోయేది కాంగ్రెస్ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు.