వేద న్యూస్, మడికొండ:
ఖాకీ దుస్తుల వెనక కాఠిన్యం, కరుకుదనం మాత్రమే ఉంటుందనే అపోహ సాధారణంగా వ్యక్తమవుతుంటోంది. కాగా, అది అసత్యమని నిరూపిస్తూ.. ఖాకీ దుస్తుల వెనక సేవా దృక్పథం ఉంటుందని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు మడికొండ పీఎస్ హెడ్ కానిస్టేబుల్ జయరాజు…
గ్రేటర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మడికొండ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జి. జయరాజు.. ఓ వైపు వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరో వైపున తన వంతుగా సమాజ సేవలో ముందుకు సాగుతున్నారు. ‘ఎవరో ఒకరు ఎపుడో అప్పుడు నడవరా.. ముందుకు అటో ఇటో ఎటో మరి..’ అని అన్నట్టుగా .. తన వంతుగా శక్తి వంచన లేకుండా హెడ్ కానిస్టేబుల్ జయరాజు.. తోచినంతలో సేవ చేస్తున్నారు. ‘పే బ్యాక్ టు సొసైటీ’ అనే ఆలోచనను ఆచరణలో అమలు చేస్తున్నారు.
రక్తదానంలో రా‘రాజు’
జయరాజు ప్రతీ పండుగకు ప్రతి నెలా పేద ప్రజలకు నెల సరిపడ కిరాణా సరుకులను అందిస్తున్నారు. ఇప్పటి వరకు 35 సార్లు ఓ నెగెటివ్ రక్తాన్ని దానం చేశారు. ఇతరులతో రక్తాన్ని దానం చేపించడం, కళ్లను దానం చేయించడం, ప్రతి పాఠశాలలో పెద్దబాలశిక్ష పుస్తకాన్ని అందించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విధి నిర్వహణలో చురుకుగా పాల్గొనడంతో పాటు ప్రతిరోజూ 20 నుంచి 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఉదయం పూట ప్రజలకు అవగాహన కల్పించడం లాంటి వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్న జయరాజు సేవలను మెగా హెల్పింగ్ ఫౌండేషన్ వారు గుర్తించారు.
గోల్డ్ స్టార్ సేవా ప్రతిభ అవార్డు 2025 కు హెడ్ కానిస్టేబుల్ జయరాజును ఎంపిక చేశారు. ఈనెల 31వ తేదీన హైదరాబాద్ లోని త్యాగరాయ ఘన సభలో మెగా హెల్పింగ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శిరీష చేతుల మీదుగా జయరాజు అవార్డు అందుకోనున్నారు. కాగా, ఖాకీ దుస్తులు ధరించి.. ఓ వైపు వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరో వైపున సేవా మార్గంలో ముందుకు సాగుతున్న జయరాజుకు ఇలాంటి అవార్డులు మరెన్నో రావాలని, ఆయన వృత్తి జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని పలువురు ఆకాంక్షించారు.