- సందడిగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం
- పాల్గొన్న ప్రముఖులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ,
-సందేశం పంపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
వేద న్యూస్, హైదరాబాద్ :
వేషభాషలు వేరయినా అందరం భారతీయులమనే భావనతో కలిసి ముందుకెళ్తున్నామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందరం కలిసి ఉండాలనేది ‘అలయ్ బలయ్’ ఉద్దేశమని తెలిపారు. 20 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కొనియాడారు.
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం శుక్రవారం సందడిగా సాగింది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దసరా మరుసటి రోజు నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు.
ఈ వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ, ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీపీఐ నేత నారాయణ సినీనటులు నాగార్జున, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లు చాటిచెప్పేలా అలయ్ బలయ్ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా ప్రముఖులను దత్తాత్రేయ సత్కరించారు.
ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..చిన్నచిన్న విభేదాలు వచ్చినా భారతీయులం అంతా ఒక్కటే అనే భావనతో అందరూ కలిసి ముందుకు వెళ్తుంటారు. ఈ కార్యక్రమంతో ఐక్యతా సందేశాన్ని అందించడం మహదానందంగా ఉందని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దత్తాత్రేయ, విజయలక్ష్మిలకు అభినందనలు తెలిపారు. అనంతరం
సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. అందరినీ ఒక్కచోట చేర్చి ఐక్యత తెచ్చేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
సంప్రదాయాలకు అనుగుణంగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్న దత్తాత్రేయ, విజయలక్ష్మిలకు ఆయన అభినందనలు తెలిపారు.

దత్తాత్రేయ అజాత శత్రువు
పండుగల సీజన్‌లో ప్రధాని మోడీ మరో పండుగ ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జీఎస్టీ తగ్గించి ప్రజలకు అతి పెద్ద పండుగ ఇచ్చారన్నారు. జీఎస్టీ తగ్గించి నిజమైన అలయ్ బలయ్ మోదీ కల్పించారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, దత్తాత్రేయ అజాత శత్రువని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ప్రేమిస్తారని కొనియాడారు. అందుకే పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారని ఆయన చెప్పారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం
అలయ్ బలయ్ వేడుకకు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్మును దత్తాత్రేయ ఆహ్వానించారు. ఇతర షెడ్యూల్ కారణాలతో రాష్ట్రపతి ఈ వేడుకకు హాజరు కాలేక పోయినా సందేశం పంపారు.
సోదరభావాన్ని పెంపొందించే వేడుక అలయ్ బలయ్ అని ద్రౌపదీ ముర్ము అన్నారు. హైదరాబాద్ లో శుక్రవారం పండుగ ఎంతో ఉత్సాహంగా నిర్వహించనున్నారని తెలిసి సంతోషించానని పేర్కొన్నారు. తెలంగాణ ఆచారాలను పునరుజ్జీవింపజేయడానికి అలయ్ బలయ్ పండుగను ప్రారంభించిన బండారు దత్తాత్రేయకు, తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలుపుతూ రాష్ట్రపతి సందేశం పంపారు.