• అలయ్ బలయ్ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

వేద న్యూస్, హైదరాబాద్‌ :

మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సంకల్పంతో ప్రారంభమైన “అలయ్ బలయ్” వేడుకలు గత రెండు దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతున్నాయి.

ఈ వేడుకలకు బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ,
“విజయదశమి తర్వాత రోజు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను భవిష్యత్ తరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో శ్రీ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కులాలు, మతాలు, రాజకీయాలు, ప్రాంతాలు అన్నవన్నీ అతీతంగా అందర్నీ ఒకే వేదికపైకి తీసుకురావడం దత్తన్న గారికే సాధ్యం. ఆయన నిజమైన అజాతశత్రువు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలిచారు,” అని తెలిపారు.

అలాగే ఆయన కుమార్తె విజయలక్ష్మి అదే స్పూర్తితో ఈ వేడుకలను కొనసాగించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు.

భవిష్యత్తులో కూడా అలయ్ బలయ్ వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పేర్కొన్నారు.