వేద న్యూస్, వరంగల్:
ఈ విశ్వాన్ని సృష్టించిన శక్తిని దైవంగా భావిస్తే, మానవాళి సృష్టికి మూలమైన తల్లి కూడా దైవమేనని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని (మార్చి 12) పురస్కరించుకుని మంత్రి సురేఖ మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సాంకేతికంగా మార్చి 12న మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ ప్రతి రోజు మాతృమూర్తుల దినోత్సవమేనని, కుటుంబాన్ని ముందుకు నడిపించడంలో తల్లి పాత్రకున్న విలువ అలాంటిదని అన్నారు. సృష్టిలో స్త్రీ పాత్ర వైవిధ్యభరితమైనదని, ఒక మహిళ తాను తల్లి అయ్యాక మరో జన్మ ఎత్తి ఈ ప్రపంచానికి కొత్తగా పరిచయమవుతుందని మంత్రి తెలిపారు. కుటుంబాన్ని తీర్చిదిద్దేందుకు ఎన్నో త్యాగాలు చేసే అమ్మ వంటి త్యాగశీలి, సహనశీలి, ప్రేమమూర్తి ఈ విశ్వంలో మరొకరు ఉండరని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాతృమూర్తుల ఆరోగ్య పరిరక్షణకు, వికాసానికి తెచ్చిన చట్టాలు, చేపట్టిన కార్యక్రమాలు వారి జీవితాల్లో గొప్ప మార్పును తేవడంతో పాటు, తర్వాత కాలంలో ఈ దిశగా సమగ్ర చట్టాలు తెచ్చేందుకు ఆధారంగా నిలిచాయని మంత్రి సురేఖ తెలిపారు. ఈ దిశగా మరిన్ని కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందని అన్నారు. పిల్లలకు జన్మనిచ్చి, వారి ఎదుగుదలకు తమ జీవితాన్ని ధారపోసిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.