- ఇద్దరమ్మలు కొలువుదీరిన అరుదైన పుణ్యక్షేత్రం
- అచంచలమైన విశ్వాసంతో భక్తుల ప్రత్యేక పూజలు
- భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఇందిరానగర్ ఆలయం
- కులమతాలకు అతీతంగా పోటెత్తుతున్న జనం..రెండో చంద్రాపూర్గా ప్రశస్తి
- చైత్ర పౌర్ణమి రోజు అంగరంగ వైభవంగా జాతర..తండోపతండాలుగా భక్తుల రాక
వేద న్యూస్, ఆసిఫాబాద్:
ఇద్దరమ్మలు కొలువుదీరిన మహిమ గల పుణ్యక్షేత్రం శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి ఆలయం. భక్తకోటి కొంగు బంగారంగా వర్ధిల్లుతున్న ఈ క్షేత్ర ప్రాశస్త్యం గురించి తెలుసుకున్న జనం తండోపతండాలుగా అమ్మవారి దర్శనానికి క్యూ కడుతూనే ఉన్నారు. కోరిన కోరికెలు తీర్చే అమ్మ వార్లకు శ్రద్ధగా పూజలు చేస్తున్నారు. అమ్మవారికి మొక్కులు సమర్పిస్తూ భక్తులు..అచంచలమైన విశ్వాసంతో దేవీ ఆలయాన్ని మళ్లీ మళ్లీ దర్శించుకుంటున్నారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో కొలువు దీరిన శ్రీకనకదుర్గా దేవి స్వయంభూ శ్రీమహంకాళీ దేవీ ఆలయంలో ఈ నెల 15 నుంచి 23 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు చేయగా, అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు.
అమ్మవారి ఆలయ క్షేత్రమహత్యం
ఇందిరానగర్ శ్రీ కనకాదుర్గాదేవి స్వయంభూ అమ్మవారు గ్రామంలో వెలిసిన తీరు, ఆలయ నిర్మాణానికి సంబంధించిన స్థల పురాణం, పూర్వీకులు, గ్రామస్తులు, అర్చకుల కథనం ప్రకారం..ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన సమీపంలో అటవీప్రాంతం అప్పట్లో దిట్టంగా ఉండేది. అందులో పెద్ద పులి సహా ఇతర అనేక క్రూరమృగాలు తిరుగుతూ ఉండేవి. ఆదివాసీ గిరిజన ప్రజలు అడవిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తుండేవారు.

ఈ క్రమంలో వారు అటవీకి వెళ్లే క్రమంలో..సమీప పంట పొలాలకు వెళ్లే క్రమంలో తమకు ఏ ఆపదా కలగకూడదని ఆ మార్గంలో వెలసి ఉన్న పుట్ట, అమ్మవారి విగ్రహాన్ని మొక్కేవారు. అలా అమ్మవారిని శరణు కోరితే అమ్మ చల్లంగా చూసి, ఆదివాసీ ప్రజలు క్షేమంగా ఇంటికి చేరుకునే వారని చెబుతారు. ఇదంతా కూడా సుమారు 100 ఏండ్ల కిందట జరిగిందని పూర్వీకులు చెప్తున్న మాట. అలా సమయం గడస్తున్న కొద్దీ కాలక్రమంలో అడవులు తగ్గిపోగా, అతివృష్టి వల్ల వరదలు రాగా, వాగు పొంగగా, అమ్మవారున్న స్థలం, పుట్ట, విగ్రహం నీట మునిగింది.
గ్రామస్తులు సైతం వాగు దగ్గరగా ఉన్న తమ ఆవాసాలను అక్కడి నుంచి మార్చుకుని రోడ్డుకు వచ్చారు. వరదల ముంపు బారిన పడకుండా గ్రామస్తులు ఆవాసాలు మారారు. అలా అమ్మవారు భూమిలో నిక్షిప్తం కాగా, ఆ ప్రాంతంలో మళ్లీ కొద్ది రోజులకు పుట్ట వెలసింది. అదే సమయంలో అంటే 2014లో కాగజ్ నగర్ మండలం బారెగూడ గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి-నారాయణ దంపతుల కుమారుడు వినోద్, తన మేనత్త ఇంటికి చుట్టపు చూపుగా వచ్చి చదువుకుంటున్నాడు. ఆ సమయంలో అతనికి రాత్రి నిద్రలో అమ్మవారు, పాము కనిపించగా భయపడ్డారు. అయితే, తమ కుటుంబంలో నాల్గో తరమైన తనకు అమ్మవారు పూనారనే అనుకున్నారు.
ఈ సమయంలోనే తన మేనత్తకు ఉన్న ప్లాట్‌లో ఆలయ శంకుస్థాపన కోసం పనులు ప్రారంభించారు. అందుకు గ్రామస్తులను అడగగా, పుట్ట ఉన్న ప్రాంతంలోకి వెళ్లకూడదన్నట్లు సూచించారు. అయినప్పటికీ వినోద్ పనులు ప్రారంభించగా, పనుల్లో భాగంగా ట్రాక్టర్ ద్వారా పుట్టను నెట్టివేశారు. అప్పుడు పుట్టలో నుంచి పాము బయటకు వెళ్లిపోయిందట. అనంతరం ఆలయంలో అమ్మవారి ఫొటో పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు. అలా ఆలయంలో పూజలు చేసిన రెండు రోజులకు వినోద్‌కు అమ్మవారు పాము రూపంలో కనిపించింది.
గంటతో అమ్మవారికి హారతి ఇస్తున్న క్రమంలో పాము రూపంలో అమ్మవారు దర్శనమిచ్చిందట. తాను పుట్టలో కొలువై ఉన్నానని మహంకాళీ అమ్మవారు వినోద్‌కు చెప్పారట. దాంతో వెంటనే వారు తొమ్మిది రోజులు ఉదయం, రాత్రి తొమ్మిది బిందెల నీళ్లు పుట్టపై పోశారు. ఆ తర్వాత అమ్మ వారి శిలా విగ్రహం బయటపడింది. ఇక అప్పటి నుంచి ఆలయానికి భక్తులు, గ్రామస్తుల రాకపోకలు క్రమంగా పెరిగాయి. దేవర వినోద్ ఆధ్వర్యంలో ఆలయం నిర్మాణం జరగగా, మహంకాళీ విగ్రహంతో పాటు శ్రీ కనక దుర్గాదేవి విగ్రహాన్నీ ప్రతిష్టించారు. ఆలయ నిర్మాణం నాటి నుంచి దేవర వినోద్ ఆలయ ప్రధాన అర్చకులుగా సేవలందిస్తున్నారు.

కుల, మతాలకు అతీతంగా అందరూ అమ్మవారి భక్తులే
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోనే కాకుండా సమీప ప్రాంతం నుంచి మొదలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగానే కాకుండా రాష్ట్రం దాటి మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన భారతదేశంలో కుల, మతాలకు అతీతంగా భక్తులు తమ కోరికెలు నెరవేర్చాలని ఇందిరానగర్ శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి అమ్మవారిని వేడుకుంటున్నారు.

అమ్మవారి మహిమ, కృపకు భక్తజనం పాత్రులవుతున్నారు. ఈ క్రమంలోనే రెండో చంద్రాపూర్గా ఈ ఆలయం ప్రశస్తి గాంచింది. మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో కొలువుదీరిన చాందా మహంకాళీ మాదిరిగానే ఇందిరానగర్‌లో అమ్మవారికి పూజలు అందుతున్నాయి.

వందల సంఖ్యలో ఆలయానికి భక్తుల రాక
గోధుమ పిండి దీపం, బెల్లంపూర్ణ, బెల్లంపాకం, తియ్యని పాను, మేకలు, కోళ్లను మహంకాళీ అమ్మవారికి బలి ఇచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఒకే ఆలయంలో ఇద్దరు అమ్మవార్లు కొలువుండే అరుదైన ఆలయం ఇందిరానగర్‌లో ఉండగా, అమ్మవారి దర్శనానికి భక్తులు వందల సంఖ్యలో వచ్చి ప్రతీ రోజు కిక్కిరిసిపోతుండటం విశేషం. ఆంధ్రా అమ్మవారు కనకదుర్గా దేవి, మహారాష్ట్రలో అమ్మవారు మహంకాళీ వారు.. ఇద్దరమ్మలు మన తెలంగాణలో కొలువు దీరిన ఇందిరా నగర్ ఆలయ దర్శనభాగ్యం భాగ్యమేనని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు.

భూమిలోపల 10 ఫీట్ల గుహలో కొలువుదీరిన మహంకాళీ అమ్మవారు పడుకొని ఉండగా, ఆలయానికి అభిముఖంగా 21 అడుగుల మహంకాళీ అమ్మవారిని, అమ్మవారు వెలసిన పుట్ట పై 11 పైట్ల ఎత్తుతో ఐదు శిరస్సుల నాగ దేవతను ప్రతిష్టించారు. అమ్మవారి దర్శన భాగ్యంతోనే తమ కోరికెలు నెరవేరుతున్నాయని భక్తులు చెబుతున్నారు. పిల్లలు కాని వారికి పిల్లలు, ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన వారికి ఉద్యోగాలు ఆరోగ్య సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్న అమ్మవారి అనుగ్రహంతో నెరవేరుతున్నాయని భక్తుల నమ్మకం.

ఆలయంలో చైత్ర మాసంలో పౌర్ణమి రోజున మహంకాళీ జాతర, బోనాల పండగను నిర్వహిస్తారు. ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు కనక దుర్గమకు 10 రోజుల పూజలు నిర్వహిస్తారు. ఆలయానికి మంగళ, గురు, శుక్ర, ఆదివారాల్లో భక్తులు పోటెత్తుతుంటారు. ఇక వచ్చే భక్తులకు మంగళవారం, గురువారం పులిహోర, పరమాన్నం ప్రసాదంగా అందిస్తున్నారు. ప్రతీ ఆదివారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు.
వైభవంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు : ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్
శ్రీకనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ అమ్మవారి కృపతో భక్తులకు అన్ని సౌకర్యాలు అందించగలుగుతున్నాం. భక్తకోటి సహకారంతోనే ఆలయాన్ని గొప్పగా తయారు చేయగలిగాం. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే దసరా నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా చేశాం. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నా. చాందా మహంకాళీగా ఇందిరానగర్ దేవీ ఆలయం ప్రశస్తి పొందడం సంతోషం.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు : మోడెమ్ తిరుపతి గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షులు
అత్యంత వైభవోపేతంగా తొమ్మిది రోజుల పాటు ఇందిరానగర్ శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ ఆలయంలో అమ్మవారి కృపతో దసరా ఉత్సవాలు నిర్వహించనున్నాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం. పెద్ద ఎత్తున జరిగే ఉత్సవాలలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. భక్తకోటి అధిక సంఖ్యలో ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతున్నాం.