•  జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఫిర్యాదు

వేద న్యూస్, జమ్మికుంట:
2021లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ‘దళిత బంధు’ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంగతి అందరికీ విదితమే. ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కోసం అప్పటి సర్కార్ రూ.2,000 కోట్లు కేటాయించిందని, అయితే, పథకం అమలులో భాగంగా బోగస్ కొటేషన్లతో జరిగిన రూ.300 కోట్ల అవినీతిపై విచారణ జరిపించాలని జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి కోరారు.

ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 17,600 ‘దళిత బంధు’ యూనిట్లు కాగా, లబ్ధిదారులకు రూ.10 లక్షలు జమయ్యాయని చెప్పారు. అయితే, ఈ పథకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కొటేషన్, జీఎస్టీల పేరిట ఒక్కో కొటేషన్ కు లబ్ధిదారుల నుంచి దాదాపు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు.

కమీషన్ల పేరుతో లబ్ధిదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను దోచుకున్నారని తెలిపారు. హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి( ప్రస్తుతం ఎమ్మెల్యే), అప్పటి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరులు కమీషన్ల రూపంలో డబ్బులను లబ్ధిదారుల నుంచి దోచుకున్నారని ఆరోపించారు. సీఐడీ, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ సంస్థతో విచారణ జరిపి వారి నుంచి డబ్బులు రికవరీ చేసి లబ్ధిదారులకు ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. రెండో విడత ‘దళిత బంధు’ మంజూరు చేయాలని వినతి పత్రంలో కోరినట్లు వెల్లడించారు.