- అనురాగ్ సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలు
- అనాథలు, వృద్ధుల ఆశ్రమాలకు తన వంతు సాయం
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ఉదయం లేచింది మొదలు..తనకు తోచినంతలో ఇతరులకు సాయం చేయాలనే సంకల్పంతో ఆమె అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో తమకంటూ ఎవరూ అండగా లేరు అనే భావనలో ఉన్న అనాథలు, సీనియర్ సిటిజన్స్, వృద్ధులకు..‘‘నేనున్నాను’’ అనే భరోసాను కల్పిస్తున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరు తమ పనుల్లో బిజీగా గడిపేస్తున్న క్రమంలో..మానసిక దివ్యాంగులు, పెద్దలు, వృద్ధులు, బధిరులు, అంధుల కోసం సమయం కేటాయించి వారితో హాయిగా మాట్లాడుతూ..వారికి పలు విషయాలపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వారితో చక్కగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఆమెనే అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్, ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ కె.అనితారెడ్డి.
దైనందిన జీవితంలో ప్రతీ ఒక్కరు తమ పని తాము చేసుకునేందుకు ప్రయారిటీ ఇస్తుంటారు. కానీ, అనితారెడ్డి మాత్రం ఇతరుల కోసం సమయం కేటాయిస్తూ..ఆదర్శంగా నిలుస్తున్నారు. పది మందికి సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని భావించే..ఆమె కన్జూమర్ రైట్స్ కమిషన్ చైర్ పర్సన్ గా, వృత్తి పరంగా తన పనులు చేసుకుంటూనే..అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ద్వారా నిత్యం సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మానసిక దివ్యాంగులు, బధిరులు, అంధులతో ముచ్చటిస్తూ..నిత్యం వారు ఉండే ఆశ్రమాలను సందర్శిస్తున్నారు.
అక్కడ వారికి కావాల్సిన సామగ్రిని అందజేస్తూ వారి యోగక్షేమాల గురించి ఆరా తీయడం అనితారెడ్డి నిత్య దినచర్యని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే వారికి కావాల్సినవి అందించేందుకు, తన వంతు సాయం చేయడంలో అనితారెడ్డి ముందుంటారు. మహిళలు స్వశక్తితో తమ కాళ్ల మీద తామే నిలబడాలని అనితారెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు.
సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే క్రమశిక్షణకు తోడు అకుంఠిత దీక్షతో లక్ష్యం కోసం కృషి చేయాలనే నాలుగు మంచి మాటలు..ఆశ్రమాలలో ఉండే అనాథ పిల్లలకు అనితారెడ్డి చెప్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరిస్తున్నారు. పండుగలు సైతం వారి మధ్యనే హాయిగా అనితారెడ్డి నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం చలికాలం కాగా, ఈ సమయంలో వృద్ధులు, పిల్లలకు అవసరమైన..చలిని నివారించే ఉలెన్ క్యాప్స్, దుప్పట్లు అందిస్తుండటం విశేషం. సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యూనల్ బెంచ్ మెంబర్ గా ఉంటూనే సీనియర్ సిటిజన్ల శ్రేయస్సుకు అనితారెడ్డి పాటు పడుతున్నారు. అనాథలకు అప్యాయత, ప్రేమను పంచడం మానవత్వానికి నిదర్శనం అని ఆమె పేర్కొంటున్నారు.