- అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్, మాజీ సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ఎన్నికల ప్రచారంలో 18 ఏండ్లలోపు పిల్లలను వినియోగించడం చట్టరిత్యా నేరం అని, పిల్లలను ఇలాంటి వాటిలో ప్రోత్సాహపరచినా ఏ విధంగా వినియోగించినా..జువెనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులవుతారని అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్, మాజీ సీడబ్యుసీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మధ్య పిల్లలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయని, సంబంధిత అధికారులు దీనిపై శ్రద్ధ వహించాలని కోరారు.
చట్టం ఎవరికి చుట్టం కాదని, రాజకీయ నాయకులు తల్లిదండ్రులు, పిల్లలతో నిర్వహించే సంస్థలు, స్కూల్ యాజమాన్యం దీని పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 18 ఏండ్ల లోపు పిల్లలు ఎక్కడ ఎన్నికల ప్రచారంలో కనిపించినా, ఇతర పనులు చేస్తూ కనిపించినా..1098 లేదా 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
18 సంవత్సరాలలోపు పిల్లలంతా జువెనల్ జస్టిస్ చట్టం పరిధిలో ఉంటారని డాక్టర్ అనితా రెడ్డి వెల్లడించారు. ప్రతీ ఒక్కరు చట్టాల పై అవగాహన కలిగి ఉండి చట్టాలను గౌరవించాలని అన్నారు. పిల్లల కేర్ అండ్ ప్రొటెక్షన్ లో శ్రద్ధ వహించి పిల్లల హక్కులను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని డాక్టర్ అనితా రెడ్డి స్పష్టం చేశారు.