- చెరువుల సంక్షోభం – శాస్త్రీయ పరిష్కారాలతో సుస్థిర జలఆవాసాల దిశగా…
- హైదరాబాద్ – సికింద్రాబాద్ పట్టణ చెరువుల సంక్షోభ స్థితి మరియు యూట్రిఫికేషన్ ప్రమాదం
- కాలుష్య నియంత్రణలో సోర్స్ కంట్రోల్ & ఎస్.టి.పి. వ్యవస్థల బలోపేతం
- రిపేరియన్ బఫర్ జోన్‌లు, బయో-రెమిడియేషన్ మరియు జీవవైవిధ్య పునరుద్ధరణ
- శాస్త్రీయ మానిటరింగ్, జి.ఐ.ఎస్ మ్యాపింగ్ మరియు డేటా ఆధారిత పాలన
- సమాజ భాగస్వామ్యం, చట్ట అమలు మరియు సుస్థిర బ్లూ–గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి
హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ పట్టణాలలోని చెరువులు మానవ కార్యకలాపాల వల్ల కలుషితమై, యూట్రిఫికేషన్ సమస్యలతో జీవచ్చవంలా కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకప్పుడు జంటనగరాలైన సికింద్రాబాద్–హైదరాబాద్ పరిసరాల్లో దాదాపు 1400కు పైగా చెరువులు, కుంటలు, తటాకాలు ఉండేవి. నిజాం వారి పూర్వ పాలకులచే నిర్మించబడి, వర్షాధార జలవ్యవస్థను బలపరిచిన ఈ జలాశయాలు నగర జీవనాడిగా నిలిచాయి. హుస్సేన్ సాగర్ , దుర్గం చెరువు , ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్ , మీర్ ఆలం ట్యాంక్ , శామీర్పేట్ లేక్, ఆమీన్ పూర్ లేక్ వంటి చెరువులు తాగునీరు, భూగర్భజలాల పునర్వినియోగం, జీవవైవిధ్య సంరక్షణలో కీలకపాత్ర పోషించాయి. కానీ వేగవంతమైన నగరీకరణ, ఆక్రమణలు, శుద్ధి చేయని మురుగునీటి ప్రవాహాలు, పరిశ్రమల ఘన–ద్రవ వ్యర్థాలు ఈ జలఆవాసాలను క్రమంగా కలుషిత కూపాలుగా మార్చుతున్నాయి. చెరువులు కలుషితం కావడానికి ప్రధాన కారణం శుద్ధి చేయని మురుగునీరు (సీవేజ్) నేరుగా కలవడం. దీన్ని అరికట్టడానికి ఎస్.టీ.పి. (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్) ల సామర్థ్యాన్ని పెంచాలి.
కేవలం పైపుల ద్వారా మళ్లించడమే కాకుండా, చెరువులోకి వచ్చే ప్రవాహ మార్గాల్లో ‘నిర్మిత చిత్తడి నేలలు’ (కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్) ఏర్పాటు చేయాలి. ఇందులో మొక్కలు సహజ వడపోత కేంద్రాలుగా పనిచేసి నైట్రేట్లు, ఫాస్ఫేట్లను గ్రహిస్తాయి. దీనివల్ల నీటిలోని పోషకాల సాంద్రత తగ్గి, గుర్రపుడెక్క వంటి కలుపు మొక్కల పెరుగుదల అదుపులోకి వస్తుంది. ఈ చెరువులను రక్షించడానికి శాస్త్రీయ పద్ధతులతో సుస్థిర చర్యలు తీసుకోవాలి.
హైదరాబాద్ జంట నగరాల కలుషిత స్థితి విశ్లేషణ:
యూట్రోఫికేషన్ చెరువుల నిశ్శబ్ద మరణం: యూట్రోఫికేషన్ అంటే నదులు, సరస్సులు వంటి నీటి వనరులలో ఫాస్ఫేట్లు, నైట్రోజన్ వంటి పోషకాలు (nutrients) అధికంగా చేరడం వల్ల ఆల్గే (పాచి) మరియు మొక్కలు విపరీతంగా పెరగడం. ఈ ప్రక్రియ వల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గి, చేపలు, ఇతర జలచరాలు మరణించి నీటి కాలుష్యం ఏర్పడుతుంది. హైదరాబాద్ మహానగర ప్రాంతంలో 185 చెరువులలో 23 పూర్తిగా ఆగిపోయాయి, 25లో ఆక్సిజన్ స్థాయిలు 1 mg/l కంటే తక్కువగా ఉన్నాయి, ఇది జలజీవులకు మారకమైనది. మురుగునీరు ప్రవాహం, హైసిన్త్, అల్గే వ్యాప్తి వల్ల డిసాల్వ్డ్ ఆక్సిజన్ (డి.ఓ) తగ్గి, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బి.ఓ.డి) పెరిగింది,
ఇది యూట్రిఫికేషన్‌కు దారితీస్తోంది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీ.జి.పి.సీ.బి) డేటా ప్రకారం, ఎస్.టీ.పి.లు సరిగా పనిచేయకపోవడం, సీవేజ్ డైవర్షన్ లోపాలు ఈ సమస్యలకు కారణం. డ్రైనేజీ ద్వారా వచ్చే నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, క్లోరైడ్లు వంటి అధిక పోషకాలు (న్యూట్రింట్స్) నీటిలో పేరుకుపోతే యూట్రిఫికేషన్ జరుగుతుంది.
దీనివల్ల ఐకార్నియా (వాటర్ హ్యాసింత్), పిస్టియా వంటి తేలియాడే మొక్కలు విపరీతంగా పెరిగి నీటి ఉపరితలాన్ని కప్పేస్తాయి. ఫోటోసింథసిస్ లోపించి, రాత్రిపూట శ్వాసక్రియ పెరగడంతో నీటిలో కరిగిన ఆక్సిజన్ (డి.ఓ) తగ్గిపోతుంది. ఫలితంగా చేపలు, సూక్ష్మజీవులు, ఉభయచరాలు మరణిస్తాయి. ఆపై జీవ పదార్థాల క్షయం వల్ల బి.ఓ.డి (బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్) పెరిగి దుర్వాసన, పూడిక పెరుగుదల, నిల్వ సామర్థ్యం తగ్గుదల వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. కొద్ది సంవత్సరాల్లోనే చెరువు భౌతిక–రసాయనిక సమతుల్యత కోల్పోయి జీవరహితంగా మారే ప్రమాదం ఉంది.
మూలంలోనే కాలుష్య ఉత్పత్తి స్థాననియంత్రణ (సోర్స్ కంట్రోల్):
మురుగునీరు నిర్వహణ – నిర్మాణాత్మక–పర్యావరణ ఇంజినీరింగ్ చర్యలు: సుస్థిర పరిష్కారానికి మొదటి అడుగు కాలుష్యాన్ని మూలంలోనే ఆపడం. ప్రతి చెరువు క్యాచ్‌మెంట్‌లోకి వచ్చే మురుగునీటిని ఎస్.టీ.పి లు (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్) ద్వారా శుద్ధి చేయాలి. ఇంటర్‌సెప్టర్ డ్రైన్లు వేసి మురుగు నీరు నేరుగా చెరువులోకి చేరకుండా మళ్లించాలి. పరిశ్రమల కోసం కఠినమైన ఇ.టీ.పి (ఏఫ్ఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) అమలు, “పొల్యూటర్ పేస్ ప్రిన్సిపుల్” ప్రకారం జరిమానాలు, నిరంతర ఆన్‌లైన్ మానిటరింగ్ తప్పనిసరి చేయాలి. సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (ఎస్.టీ.పి) ద్వారా మురుగునీటిని డైవర్ట్ చేయాలి, కానీ ప్రస్తుతం ఎస్.టీ.పి.లు సామర్థ్యం లేకుండా పనిచేయడం వల్ల విఫలమవుతున్నాయి. ఇన్‌లెట్‌లలో ఎస్.టీ.పి.లు ఏర్పాటు, పైప్‌లైన్‌ల నిర్వహణ, రెగ్యులర్ మానిటరింగ్ ద్వారా నైట్రేట్లు, ఫాస్ఫేట్ల ప్రవాహాన్ని నియంత్రించాలి.గ్రేవాటర్ ఐలాండ్‌లు, స్టార్మ్‌వాటర్ ఛానెళ్లు నిర్మించడం ద్వారా 90% వర్షనీటి, 10% చికిత్సిత మురుగునీరు ప్రవేశం నిర్ధారించాలి. చెరువు చుట్టూ కన్స్ట్రక్టెడ్ వెట్‌ల్యాండ్స్ ఏర్పాటుచేసి సహజ శుద్ధిని ప్రోత్సహించాలి.
ఇవి మొక్కలు–మట్టి–సూక్ష్మజీవుల సహకారంతో నైట్రోజన్, ఫాస్ఫరస్‌ను తగ్గిస్తాయి. డీ-సిల్టింగ్ ద్వారా పూడికను తొలగించి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. అవసరమైతే ఎరేషన్ ఫౌంటెన్లు అమర్చి నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను పెంచాలి.
తేలియాడే కలుపుమొక్కలను యంత్రాల సహాయంతో తొలగించి, వాటిని బయోగ్యాస్/కంపోస్ట్ తయారీలో వినియోగించాలి. డెసిల్టింగ్ మరియు ఆక్సిజనేషన్డెసిల్టింగ్ ద్వారా కుప్పలు తొలగించి, చెరువు లోతును పునరుద్ధరించాలి, ఇది హైడ్రా లో 9000 ట్రక్‌ల సిల్ట్ తొలగింపుకు ఉదాహరణ. సోలార్-పవర్డ్ ఏరేషన్ సిస్టమ్‌లు, ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్లు ఆక్సిజన్ స్థాయిలను 5-6 మి.గ్రా./లీ.కు పెంచుతాయి. ఇవి జీవరాసాయనిక ప్రాణవాయు అవసరాన్ని తగ్గించి, యూట్రిఫికేషన్‌ను నియంత్రిస్తాయి.
ఏరేషన్ పద్ధతులు మరియు ఆక్సిజన్ పునరుద్ధరణ ద్వారా
యూట్రిఫికేషన్ వల్ల ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చడానికి మెకానికల్ ఏరేటర్లు (మెకానికల్ ఏరేటర్స్) లేదా కృత్రిమ ఫౌంటైన్లను ఏర్పాటు చేయాలి. ఇవి నీటిని నిరంతరం కదిలించడం ద్వారా గాలిలోని ఆక్సిజన్ నీటిలో కరిగేలా చేస్తాయి. నీటిలో ఆక్సిజన్ శాతం పెరిగినప్పుడు, దుర్వాసన తగ్గుతుంది మరియు చేపలు వంటి జలచరాలు మళ్లీ వృద్ధి చెందుతాయి. ఇది నీటి ఆవాస సమతుల్యతను (ఆక్వాటిక్ ఎకోసిస్టం బాలన్స్) తిరిగి పునరుద్ధరిస్తుంది.
రిపేరియన్ బఫర్ జోన్‌లు మరియు జీవవైవిధ్య పునరుద్ధరణ:
చెరువు చుట్టూ కనీసం 30–50 మీటర్ల బఫర్ జోన్ను గ్రీన్ బెల్ట్‌గా అభివృద్ధి చేసి నిర్మాణాలను నిషేధించాలి. స్వదేశీ జలచెర మొక్కలు (నేటివ్ మాక్రోఫైట్స్) నాటడం ద్వారా సహజ సమతుల్యతను పునరుద్ధరించాలి. పక్షుల గూళ్లు, తీర ప్రాంతపు వృక్షాలు, తక్కువ లోతు గల ప్రాంతాలు ఏర్పరచడం ద్వారా చేపలు–ఉభయచరాలకు అనుకూల ఆవాసం కల్పించాలి.
జీవపదార్థాలు పునరుద్ధరణహైసిన్త్, పిస్టియా వంటి ఇన్వాసివ్ స్పీసీస్ తొలగించి, సబ్‌మర్జ్డ్ అక్వాటిక్ వెజిటేషన్ (27% కవరేజ్) పెంచడం ద్వారా ఫాస్ఫరస్, నైట్రోజన్ శోషణ జరుగుతుంది. మెడిసినల్ ప్లాంట్లు, బయో-ఫెన్సింగ్ ఉపయోగించి స్వీచ్ గ్రాస్-అల్గే రెజిమ్‌ను మార్చవచ్చు. ఇది చెరువు స్వీపరిఫికేషన్ సామర్థ్యాన్ని పెంచుతుంది.
గుర్రపుడెక్క నిర్మూలన మరియు బయో-రెమిడియేషన్ (బయోరెమీడియేషన్ ): గుర్రపుడెక్క (ఐకర్నియా) నీటిపై దట్టంగా పేరుకుపోవడం వల్ల సూర్యరశ్మి లోపలికి ప్రసరించదు, ఫలితంగా కిరణజన్య సంయోగక్రియ జరగక ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. దీన్ని తొలగించడంతో పాటు, నీటిలోని కలుషితాలను విచ్ఛిన్నం చేయడానికి బయో-రెమిడియేషన్ పద్ధతిని వాడాలి. అంటే, హానికర బ్యాక్టీరియాను తినే సూక్ష్మజీవులను (ఎఫెక్టివ్ మైక్రోర్గానిస్మ్స్) నీటిలోకి ప్రవేశపెట్టడం ద్వారా రసాయన వ్యర్థాలను సహజంగా శుద్ధి చేయవచ్చు. ఇది జీవరసాయన ప్రాణవాయువు ఆవశ్యకతను (బి.ఓ.డి. (బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్)) తగ్గించి, జలచరాలకు ప్రాణవాయువును అందిస్తుంది.
శాస్త్రీయ మానిటరింగ్ మరియు డేటా ఆధారిత పాలన:
ప్రతి చెరువుకు డి.ఓ., బి.ఓ.డి., సీ.ఓ.డి., పిహెచ్, టీ.డీ.ఎస్., నైట్రేట్లు, ఫాస్ఫేట్లు వంటి పరామీటర్లను నెలవారీగా కొలిచే లేక్ హెల్త్ కార్డ్ అమలు చేయాలి. జియోగ్రాఫీకల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (జి.ఐ.ఎస్.) మ్యాపింగ్‌తో ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్.టీ.ఎల్.) సరిహద్దులను గుర్తించి డిజిటల్‌గా రక్షించాలి. వర్షపాతం–రన్‌ఆఫ్ మోడలింగ్ చేసి నగర వర్షపు నీటి నిర్వహణ (అర్బన్ స్టోర్మవాటర్ మానేజ్మెంట్) పథకాలను రూపొందించాలి.
చెరువుల అక్రమ ఆక్రమణలు తొలగింపు:
పూడికతీత మరియు పరీవాహక ప్రాంతాల రక్షణ (క్యాచ్మెంట్ ఏరియా మానేజ్మెంట్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) 2024లో ఏర్పడి, 1000 ఎకరాలు పైగా ఆక్రమణలు తొలగించింది, ముఖ్యంగా బూమ్-రుక్న్-ఉద్-దౌలా, సున్నం చెరువు వంటి చెరువుల్లో. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్.టీ.ఎల్) గుర్తింపు, డెమాలిషన్, హైడ్రాలజికల్ ఛానెళ్ల పునరుద్ధరణ అవసరం, ఇది హెచ్.ఎం.డి.ఏ. లేక్ ప్రొటెక్షన్ కమిటీతో సమన్వయంతో చేయాలి.
ఈ చర్యలు చెరువు లోతు, పొర్పు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరిస్తాయి. చెరువుల నీటి నిల్వ సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే శాస్త్రీయంగా పూడికతీత (డిసిల్టేషన్) చేపట్టాలి. చెరువు గట్టుల వెంట బఫర్ జోన్లను ఏర్పాటు చేసి, దేశీయ జాతి, చిత్తడి నేలల పెరిగే మొక్కలను (వెదురు, గడ్డి జాతులు) నాటడం వల్ల భూసారం కొట్టుకుపోకుండా, భూక్షయం కాకుండా ఉంటుంది. అలాగే, చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురికాకుండా జియో-ట్యాగింగ్ మరియు పక్కా సరిహద్దులను నిర్ణయించాలి. పారిశ్రామిక వ్యర్థాలు కలిపే సంస్థలపై కఠినమైన నిఘా ఉంచి, ‘పొల్యూటర్ పేస్’ సూత్రాన్ని అమలు చేయాలి.
సమాజ భాగస్వామ్యం మరియు విధాన సంస్కరణ
స్థానిక వాలంటీర్లు, కాలనీల సంఘాలు, విద్యాసంస్థలతో కలిసి “అడాప్ట్-ఏ-లేక్” కార్యక్రమాలు చేపట్టాలి. ప్లాస్టిక్ నిషేధం, పూజా సామగ్రి వేరుగా సేకరణ, అవగాహన శిబిరాలు నిర్వహించాలి. ఆక్రమణలపై జీరో టోలరెన్స్ విధానం అమలు చేసి, కోర్టు ఆదేశాల ప్రకారం పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలి. కమ్యూనిటీ పాల్గొనటం అంటే లోకల్ కమ్యూనిటీలను కస్టోడియన్‌లుగా మార్చి, అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు, సీసీటీవీ మానిటరింగ్ (180 చెరువుల్లో 1000 కెమెరాలు) ఏర్పాటు చేయాలి. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లు (పి.పి.పి.), ఐ.ఓ.టీ. డివైస్‌లతో రెఅల్-టైమ్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ అమలు చేయాలి. ఇది దీర్ఘకాలిక రక్షణకు హోలిస్టిక్ అప్రోచ్‌ను అందిస్తుంది.
సుస్థిర వారసత్వ ఆస్తిగా చెరువులు:
చెరువులు కేవలం నీటి నిల్వలే కాదు; అవి వర్షపు నీటి శోషణ, భూగర్భజలాల నింపుదల, ఉష్ణోగ్రత నియంత్రణ, జీవవైవిధ్య సంరక్షణలో కీలకం. శాస్త్రీయ పద్ధతులతో పునరుద్ధరించిన చెరువులు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని అందించే వారసత్వ ఆస్తులవుతాయి. పట్టణ ప్రణాళికలో “బ్లూ–గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్” భావనను అనుసరించి చెరువులను నగర అభివృద్ధి కేంద్రముగా పరిగణిస్తేనే దీర్ఘకాలిక ఫలితాలు సాధ్యమవుతాయి. సుస్థిర నిర్వహణలోభాగంగా వ్యూహాలురిడ్జ్-టు-రివర్ కాన్సెప్ట్‌తో అప్పర్, లోయర్ క్యాచ్‌మెంట్ చెరువులను కనెక్ట్ చేసి, స్పాంజ్ సిటీ మోడల్ అమలు చేయాలి. టీ.డి.ఆర్. పాలసీ రెవాంప్ ద్వారా ల్యాండ్ సరెండర్‌కు 200-400% ఇన్సెంటివ్‌లు ఇవ్వడం ఆక్రమణలను తగ్గిస్తుంది. రెగ్యులర్ ఫారెన్సిక్ ఆడిట్‌లు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) తో సమన్వయం ద్వారా చెరువులను ఆలిగోట్రాఫిక్-మెసోట్రాఫిక్ స్థితికి మార్చవచ్చు.
సామాజిక భాగస్వామ్యం మరియు స్థిరమైన పర్యాటకం:
చెరువులను కేవలం నీటి వనరులుగానే కాకుండా, పర్యావరణ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. స్థానిక ప్రజలకు చెరువుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, ప్లాస్టిక్ రహిత మండలాలుగా ప్రకటించాలి. చెరువుల చుట్టూ ప్రకృతి పలకలు, పక్షి వీక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు వాటిపై మమకారం పెరుగుతుంది.
ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడు తన వంతుగా వ్యర్థాలను నీటిలో వేయకుండా ఉంటేనే ఈ సహజ వారసత్వాన్ని కాపాడుకోగలం. హైదరాబాద్ చెరువుల సంరక్షణ అనేది కేవలం పర్యావరణ సమస్య కాదు—అది ప్రజారోగ్యం, నీటి భద్రత, జీవవైవిధ్యం, వాతావరణ మార్పుల నియంత్రణకు సంబంధించిన సమగ్ర అంశం.
కాలుష్య నియంత్రణ, శాస్త్రీయ పునరుద్ధరణ, కఠిన చట్ట అమలు, ప్రజల భాగస్వామ్యం—ఈ నాలుగు స్తంభాలపై ఆధారపడిన సమగ్ర చర్యల ద్వారానే మన జలఆవాసాలను కాపాడగలం. అప్పుడు మాత్రమే రేపటి తరాలకు సుస్థిర, ఆరోగ్యకర, సమతుల్య నీటి ప్రపంచాన్ని అందించగలం.
భవిష్యత్ తరాలకు వారసత్వంగా ఈ శాస్త్రీయ చర్యలతో హైదరాబాద్ చెరువులు జలఆవాసాలుగా, గ్రౌండ్‌వాటర్ రీఛార్జ్ వనరులుగా పునరుజ్జీవితమవుతాయి, బయోడైవర్సిటీని కాపాడతాయి. సమగ్ర పాలసీలు, కమ్యూనిటీ ఓనర్‌షిప్ ద్వారా ఈ నీటి ఆవాసాలు రేపు తరాలకు ఆరోగ్యకర వారసత్వంగా మిగిలతాయి. ఇది పర్యావరణ సమతుల్యతను, ప్రమాదాల నివారణను నిర్ధారిస్తుంది. హైదరాబాద్‌లోని ప్రతి చెరువు ఒక జీవవైవిధ్య భాండాగారం.
శాస్త్రీయమైన ఏకో-రిస్టోరేషన్ పద్ధతులను పాటిస్తూ, కాలుష్య కారకాలను మూలాల్లోనే తుడిచిపెడితే, రేపటి తరాలకు మనం విషపు కుప్పలను కాకుండా, స్వచ్ఛమైన నీటి ఆవాసాలను మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని రేపటి తరాలకు ఒక సుస్థిర నీటి ఆవాసాలను వారసత్వ ఆస్థిగా వారికి కానుకగా ఇవ్వగలం.

- రవిబాబు పిట్టల, ఎం.ఎస్సీ., ఎం.టెక్., (పిహెచ్.డి), పర్యావరణవేత్త, మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, జే.యన్.టీ.యు.హెచ్, హైదరాబాద్ మరియు జాయింట్ సెక్రటరీ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఎన్.జి.ఓ., తెలంగాణ స్టేట్, ఇండియా. మొబైల్: +91 9849425271