• సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి :

పార్వతీపురం,గరుగుబిల్లి, కొమరాడ,కురుపాం,జిఎం వలస, సీతానగరం మండలాలకు చెందిన వందలాది మంది ఆటో కార్మికులు పార్వతీపురం చేరుకొని,పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి వై మన్మధరావు, బి వి రమణ,కోశాధికారి గొర్లి వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తుందని ఈ పథకం అమలైన తర్వాత ఆటో కార్మికులలో 60 శాతం మందికి ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒక పథకం ప్రవేశపెట్టినపుడు దాని ప్రభావం వలన ఎంతమందికి నష్టం జరుగుతుందో కూడా పరిశీలించి శాస్త్రీయంగా నష్ట పరిహారాన్ని, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉపాధి లేక ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులలో ఉన్నారని ఈ నేపథ్యంలో ఈ ఉచిత బస్సు పథకం పెట్టిన తర్వాత ఇంకా ఆటో ,టాక్సీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రతి నెల పెన్షన్ చెల్లించాలని, వాహన మిత్ర తరహా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఏడాదికి 25 వేల రూపాయలు పరిహారం చెల్లించాలని, ఇప్పటికే వాహనాలపై తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఆటో, టాక్సీ డ్రైవర్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన కార్యచరన రూపొందించకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బంకురు సూరిబాబు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, కె సాంబమూర్తి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు సంచాన ఉమామహేశ్వరరావు, ఆటో యూనియన్ నాయకులు సంబాన చిన్న,డి రాము, క్రాంతి, నారాయణ సత్యనారాయణ, జి శ్రీను, శంకర్రావు, పోలి నాయుడు తదితరులు పాల్గొన్నారు.